ఉక్రెయిన్ పై ఈ నెల 24న అకస్మాత్తుగా యుద్ధం ప్రకటించి, ఆ దేశ రాజధాని కీవ్ వరకూ చొచ్చుకెళ్లిన రష్యా సోమవారం తమ దాడి తీవ్రతను, వేగాన్ని తగ్గించింది. గత వారం రోజులుగా సాగుతున్న రష్యా భీకర దాడిని ఉక్రెయిన్ సైనిక దళాలు వీరోచితంగా ప్రతిఘటించి రష్యా దళాలను ముందుకు సాగదీయడం లేదు.
కీవ్ నగరానికి ఉత్తరాన 30 కిమీ దూరంలో రష్యాసాయుధ దళాలు మోహరించి ఉన్నాయని, వాటిని ఉక్రెయిన్ దళాలు ధైర్యంగా ప్రతిఘటిస్తున్నాయని బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. రెండు, మూడు రోజులలో ఉక్రెయిన్ కాళ్లబేరానికి రాగలదని ఆశించిన రష్యాకు ఒక విధంగా అసహనంగా ఉన్నట్లు కనిపిస్తున్నది.
ఒక వైపు ఉక్రెయిన్ బలగాలు రష్యా సైన్యంపై క్షిపణులు, యుద్ధ ట్యాంకర్లతో దాడి చేస్తుంటే.. మరోవైపు ఉక్రెయిన్ ప్రజలు సైతం ఒక్కో యోధుడిలా తిరగబడుతున్నారు. ఆడామగ, చిన్నా పెద్ద అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆయుధాలను చేపట్టి.. దేశాన్ని, రాజధాని నగరాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్నారు.
కీవ్నగరానికి చేరువలో రష్యాదళాలు మోహరించి ఉన్నప్పటికీ ఎలాగైనా నగరాన్ని అలాగే ఉక్రెయిన్ను రక్షించుకోవాలన్న పట్టుదలతో ముందుకు వచ్చేవారికి ఉక్రెయిన్ ప్రభుత్వ ఆయుధాలను అందిస్తోంది.
కొంత మంది పౌరులు తమ వాహనాల్లోని ఫ్యూయల్ తీసి.. పెట్రోల్ బాంబులు తయారు చేసి.. రష్యన్ యుద్ధ ట్యాంకర్లపై దాడి చేస్తున్నారు.
దీంతో రష్యన్ ఆర్మీకి ఆ దేశం ఊహించని స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది. సైనికుల ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే జరిగినట్లు ఉక్రెయిన్ మీడియా చెబుతోంది. దీంతో రష్యాలో భయం మొదలైందని, ఆ దేశ బలగాలు దాడి తీవ్రతను, వేగాన్ని తగ్గించాయని ఉక్రెయిన్ మిలిటరీ ప్రకటించింది.
ఓ వైపు తమ శక్తినంతా కూడగట్టుకుని హోరాహోరీ పోరు సాగిస్తూన్న ఉక్రెయిన్.. నిన్న రష్యా ప్రతిపాదించిన శాంతి చర్చలకు ఓకే చెప్పింది. అయితే ఉక్రెనియన్ బెలారసియన్ సరిహద్దులోని గోమెల్ సిటీలో ఇరు దేశాల అధికారులు భేటీ జరిగినా ఒక అవగాహనకు రాలేకపోయారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ రష్యా సేనలను హెచ్చరించారు. తమ దేశాన్ని వెంటనే వదిలివెళ్లాలని రష్యన్ బలగాలను ఆయన స్పష్టం చేశారు. ‘తక్షణమే ఉక్రెయిన్ ను వదలిపోండి.. మీ ప్రాణాలను కాపాడుకోండి’ అని రష్యా సైనికులను ఉద్దేశించి జెలెన్స్కీ తేల్చి చెప్పారు.
రష్యాకు తమ దేశానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 4,500 మంది రష్యన్ జవాన్లు చనిపోయారని తెలిపారు. రష్యాతో యుద్ధంలో పోరాడేందుకు తమ దేశ జైళ్లలో ఉన్న పలువురు ఖైదీలను విడుదల చేస్తున్నామని చెప్పారు. ఆర్మీలో పని చేసిన అనుభవం, యుద్ధంలో ఫైట్ చేసేందుకు ఆసక్తి ఉన్న ఖైదీలను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
తమ దేశంలో మిలిటరీ, సివిలియన్ ఏరియాల్లో రష్యన్ బలగాలు దాడులకు పాల్పడ్డాయని, కానీ దురాక్రమణ ఆలోచనతో రష్యా చేసిన మిలిటరీ ఆపరేషన్ ఫెయిల్ అయిందని జనరల్ స్టాఫ్ ఆఫ్ ఉక్రెయిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ ఆర్మీ తక్కువ బలగాలతోనే రష్యా బలగాలను పెద్ద దెబ్బ తీసిందని, ఊహించని స్థాయిలో ప్రాణ నష్టం జరగడంతో రష్యా నైతిక స్థైర్యం కోల్పోయిందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో రష్యన్ సైనికులు పోరాటానికి విముఖత చూపిస్తున్నారని తెలిపారు. శత్రుదేశం ఇప్పటికైనా రియాలిటీని గుర్తించిందని, ఉక్రెయిన్ ను చూసి రష్యా భయపడుతోందని చెప్పారు.
క్రెమ్లిన్ ఊహించినట్టు ఉక్రెయిన్పై ఉక్రెయిన్పై దాడి అంతసులువు కాదని అమెరికా రక్షణ అధికారులు అంటున్నారు. రష్యాసెంట్రల్ బ్యాంకు ఆవరణ అంతా యుద్ధ టాంకుల శిధిలాలతో కనిపిస్తోంది. ఈ శిధిలాల నుంచి బయటపడడానికి సోమవారం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ వైమానిక స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్టు రష్యా సైన్యాలు ప్రకటిస్తున్నా అవన్నీ అబద్దాలే అని అమెరికా అధికార వర్గాలు ప్రకటించాయి.
సుమారు నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి. చర్చల సందర్భంగా రష్యా తమదేశంలో తక్షణమే కాల్పులను విరమించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. రష్యా ఆక్రమణలో ఉన్న క్రిమియా, డాన్బాస్ నుంచి రష్యా సేనలు భేషరతుగా వైదొలగాలని ఉక్రెయిన్ పట్టుబట్టింది. మరోవైపు రష్యా ప్రతినిధులు నాటోలో చేరబోమని ఉక్రెయిన్ హామీ ఇవ్వాలని, అదే సమయంలో తమ డిమాండ్లపై లిఖితపూర్వక హామీ తప్పనిసరి అని రష్యా ప్రతిపాదించినట్లు సమాచారం.
ఇరుపక్షాలు పంతం నెగ్గించుకోవడానికి ప్రయత్నించడంతో చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది. తాజా చర్చల సారాంశాన్ని ఇరు దేశాలు అధినేతలకు రెండు దేశాల ప్రతినిధులు నివేదించిన తర్వాత రెండో దశ చర్చలు తిరిగి జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో ఎలాంటి తీర్మానాలు లేకుండానే గోమెల్లో జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. శాంతి చర్చల కోసం ఉక్రెయిన్ తరఫున ఆ దేశ రక్షణశాఖ మంత్రితో కూడిన ఆరుగురు సభ్యులు బృందంతో రష్యాకు చెందిన ఐదుగురు ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది.