కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2020లో ఈశాన్య ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన హిందూ వ్యతిరేక అల్లర్లకు మందు వీరు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి.
వీటిని విచారించిన కోర్టు వారికి సోమవారం నోటీసులు జారీ చేసింది. అలాగే ఆప్ నేతలు మనీష్ సిసోడియా, అమానతుల్లా ఖాన్, ఎంఐఎం నేతలు వారిస్ పఠాన్, అక్బరుద్దీన్ ఒవైసీ, మహమూద్ ప్రాచా, హర్ష్ మందర్, నటి స్వర భాస్కర్, తదితరులకు కూడా నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఆదేశాలివ్వాలని కూడా ఆ పిటిషన్లో కోరారు.
మరో ప్రత్యేక పిటిషన్లో బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్వర్మ, అభయ్ వర్మలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో వారికి నోటీసులు ఇచ్చారు. కాగా, ఈ రిట్ పిటిషన్లో వారిని పార్టీ ప్రతివాదులుగా చేర్చాలా.. వద్దా.. అనే విషయంపై స్పందించేందుకే ఆయా వ్యక్తులకు నోటీసులు జారీ చేశామని, ఇది చట్ట ప్రకారం కరెక్టేనని జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్, జస్టిస్ అనూప్ కుమార్ల డివిజన్ బెంచ్ పేర్కొంది.