గతంలో అలీన విధానంకు నేతృత్వం వహిస్తున్న సమయంలో సహితం భారత్ అంతర్జాతీయ వ్యవహారాలలో సోవియట్ యూనియన్ కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు వ్యవహరిస్తుండెడిది. సాధారణంగా అమెరికా ఎత్తుగడలకు వ్యతిరేకంగా నిలబడుతూ ఉండెడి. అయితే మొదటిసారిగా, ఉక్రెయిన్ సంక్షోభం భారత్ ను ఎటూ మొగ్గు చూపకుండా `మధ్యస్థం’గా ఉండే పరిస్థితి కల్పిస్తున్నది.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలపై చర్చకు ఐరాస సాధారణ అసెంబ్లీ ‘అరుదైన అత్యవసర ప్రత్యేక సమావేశం’ కోసం భద్రతా మండలిలో జరిగే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని భారత్ నిర్ణయించింది. వారంలో ఓటింగ్ కు దూరమవడం ఇది రెండోసారి. జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుపై ఓటింగ్‌కు భద్రతామండలి ఆదివారం సమావేశమైంది.
ఈ ఓటింగ్‌కు భారత్, చైనా, యుఎఇ దూరంగా ఉండగా రష్యా వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇతర 11 సభ్యదేశాలు (ఆల్బేనియా, బ్రెజిల్, ఫ్రాన్స్, గబాన్, ఘనా, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే, బ్రిటన్, అమెరికా) అనుకూలంగా ఓటు వేశాయి.
40 ఏళ్ళ తర్వాత ఐరాసలో ఇటువంటి సమావేశం జరపాలనే ప్రతిపాదన రావడం గమనార్హం. ఐరాస చరిత్రలో కేవలం 11 పర్యాయాలు మాత్రమే ఇటువంటి అసాధారణ సమావేశాలను జరిపారు. జనరల్ అసెంబ్లీ సమావేశంపై నిర్ణయానికి జరిగే ఈ 15 సభ్యుల భద్రతా మండలి సమావేశంలో శాశ్వత దేశాలు వీటో అధికారం ఉపయోగించే వీలులేదు.
ఓటింగ్‌కు అనుకూలంగా మెజార్టీ రావడంతో భారత కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి తర్వాత ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. గత శుక్రవారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో పెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో చేయగా, భారత్, చైనా, యుఎఇ దూరంగా ఉన్నాయి.
సంక్షోభంపై శాశ్వత సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో సాధారణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. రష్యా, ఉక్రెయిన్లు బెలారస్లో శాంతి చర్చలు జరపాలన్న నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. శాంతి చర్చలే మార్గమని, దౌత్య మార్గంలోనే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ స్పష్టం చేసింది.
అయితే రష్యా సైనిక చర్యను కూడా ఖండిస్తున్నట్లు భారత్ ప్రకటించలేదు. ఉక్రెయిన్ వ్యవహారంపై భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. పాత స్నేహితుడైన రష్యా, కొత్త స్నేహితులైన పశ్చిమ దేశాల ఒత్తిడితో భారత్ ఎటూ తేల్చుకోలేకపోతుంది.
రష్యా భారతదేశానికి రక్షణ ఆయుధాల అతిపెద్ద సరఫరాదారు. బాలిస్టిక్ క్షిపణి, జలాంతర్గామిని అందించింది. రష్యాలో తయారైన 272 ఎస్యు 30 యుద్ధ విమానాలను భారత్ ప్రస్తుతం వినియోగిస్తోంది. ఇందులో ఎనిమిది రష్యా నిర్మిత కిలో క్లాస్ సబ్మెరైన్లు, 1300 కంటే ఎక్కువ రష్యన్ టి-90 ట్యాంకులు ఉన్నాయి.
అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ.. రష్యాకు చెందిన అత్యంత అధునాతన సుదూర ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ అయిన ఎస్ -400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. 2018లో రష్యాతో భారత్ 5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఐరాస భద్రతా మండలిలో రష్యా కూడా అన్ని విషయాల్లో భారత్‌కు అండగా నిలుస్తున్నది.
దశాబ్దాల తర్వాత భద్రతామండలి కీలకమైన నిర్ణయం తీసుకుందని ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్ చెప్పారు. రష్యాపై అసత్య ప్రచారం జరుగుతోందని, తమ సైనికులు ఉక్రెయిన్ పౌరులపై ఎలాంటి దాడులు చేయలేదని రష్యా రాయబారి నెబెంజియా చెప్పారు.