గతంలో ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండానే కామెడీ నటుడిగా ఉంటూ నేరుగా దేశ అధ్యక్ష పదవి స్వీకరించడంతో పాటు, ఇప్పుడు ఎటువంటి సైనిక అనుభవం లేకుండానే ప్రపంచంలో పెద్ద సైన్యములలో ఒకటైన రష్యా సేనలతో ముందుండి వీరోచితంగా పోరాడుతూ, రష్యా సేనలకు తీవ్ర ప్రతిఘటన ఇస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ హత్యకు రష్యా కుట్ర పన్నిందా?
అందుకోసం కిరాయి గుండాలను సిద్ధంగా ఉంచిందన్న వార్త ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. వారంతా ప్రత్యేకంగా శిక్షణ పొందారని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం వెలువరించింది. వారంతా వాగ్నర్ గ్రూప్ గా చెప్పుకుంటోన్న ఒక ప్రైవేటు మిలిషియాకు చెందినవారిగా పేర్కొంది. ఆ బృందాన్ని ఆఫ్రికా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
జెలెన్ స్కీతో సహా 23 మంది ప్రభుత్వ పెద్దల్ని హత్యచేసేందుకు రష్యా అధ్యక్షుడు ప్రతిన్ నుంచి ఆ బృందానికి ఆదేశాలున్నట్లు కథనం పేర్కొంది. వాగ్నర్ గ్రూపు పుతిన్ సన్నిహితుడు ఒకరు నిర్వహిస్తుండడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఆ సన్నిహితుడిని పుతిన్ చెఫ్ అని ముద్దుగా పిలుస్తారట.
వార్నర్ గ్రూపు ప్రణాళిక అమలు చేసేందుకు ఐదు వారాల క్రితమే ఆఫ్రికా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు శాంతి చర్చల నేపథ్యంలో పుతిన్ తన ప్రణాళిక అమలుకు కాస్త విరామం ఇచ్చారని, ఈ విషయాన్ని వాగ్నర్ గ్రూప్ లోని సీనియర్ సభ్యుడి సన్నిహితుడిని ఉటంకిస్తూ కథనం పేర్కొంది.
జెలెన్స్కీకి అరుదైన గౌరవం
మరోవంక, జెలెన్స్కీకి అరుదైన గౌరవం లభించింది. మంగళవారం యూరోపియన్ పార్లమెంటునుద్దేశించి ఆయన ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఆన్‌లైన్‌ద్వారా ప్రసంగించిన అనంతరం ఇయు పార్లమెంటు సభ్యులంతా లేచి నిలబడి(స్టాండింగ్ ఒవేషన్) చప్పట్లు కొట్టారు.
జెలెన్స్కీ మాట్లాడుతూ తాము మాతృభూమి కోసం, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు. తాము ఉక్రెయినీలమని, శక్తిమంతులమని, తమనెవ్వరూ విడదీయలేరని స్పష్టం చేశారు. ఆ వెంటనే సభ్యులంతా లేచి నిలబడి ఆయనను అభినందిస్తూ కరతాళ ధ్వనులు చేశారు.
రష్యా దాడిని ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌కు అండగా ఉన్నామని నిరూపించుకోవాలని జెలెన్స్కీ యూరోపియన్ పార్లమెంటును కోరారు. ‘ మీరు లేకుండానే ఉక్రెయిన్ ఒంటరిగా పోరాడుతోంది. మేము మా బలాన్ని నిరూపించుకున్నాం. కనీసం మేమూ మీలాంటి వాళ్లమని నిరూపించుకున్నాం. మాకు అండగా ఉన్నామని, మమ్మల్ని వదిలిపెట్టమని మీరు కూడా నిరూపించుకోవాలి’ అని జెలెన్స్కీ విజ్ఞప్తి చేసారు.