ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రాజకీయ పోరాటంకై బిజెపియేతర పక్షాలను సమీకరించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ద్వారా జాతీయస్థాయి దృష్టి ఆకర్షించాలని నిర్ణయించారని తెలుస్తున్నది.
నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.
రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆయన ఈ నెల 4న వారణాసిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ వంటి హేమాహేమీలతో కలసి సమాజవాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూటమికి మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు తెలిసింది.
ఏడు దశలలో ఎన్నికలు జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ లో చివరిదశ అయిన మార్చ్ 7న వారణాసిలో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహితం అక్కడనే మూడు రోజులకు ఎన్నికల ప్రచారం కోసం మకాం వేస్తున్నారు.
ఫెడరల్ ఫ్రంట్ ఏరాటు దిశగా ఈ మధ్య కేసీఆర్ చర్చలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భేటీ కావడంతోపాటు.. యూపీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారని సమాచారం.ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ తో భేటీ తర్వాత పలు పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన నిపు ణులు, మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోనూ కేసీఆర్ వరుస భేటీలు జరుపుతారని టి ఆర్ ఎస్ వర్గాలు పేర్కొన్నారు. .
నిజానికి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తామంటూ గతంలో సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంకేతాలిచ్చారు. వారణాసి పర్యటన ద్వారా బిజెపి వ్యతిరేక పోరులో అగ్రనేతలతో ఒకడిగా తనను దేశ ప్రజల ముందు పరిచయం చేసుకోవడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తున్నది.