అత్యాధునిక ఆయుధాలు, సంఖ్యాపరంగా పలు రేట్లు ఉన్నప్పటికీ రష్యా సైనికులు ఉక్రెయిన్ సైనికుల ప్రతిఘటన ముందు నిలబడలేక పోవడానికి, గత వారం రోజులుగా అనుకున్నంతగా పురోగతి సాధింపలేక పోవడానికి రష్యా సైనికులలో యుద్ధం అంటే వణుకు పుట్టడమే కారణంగా ప్రచారం జరుగుతున్నది.
‘కనిపించిన ప్రతిదాన్నీ కాల్చేయండి’ అని ఆదేశాలు రావడంతో దిగ్భ్రాంతికి గురై, వారు ఏడుస్తున్నారని, యుద్ధంలో ఉపయోగించే వాహనాలను స్వయంగా ధ్వంసం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ వివరాలను ఓ పెంటగాన్ అధికారిని ఉటంకిస్తూ అమెరికన్ మీడియా బుధవారం వెల్లడించింది.
రష్యా దళాల్లో ఎక్కువ మంది యువత ఉన్నారు. వీరికి పూర్తి స్థాయి యుద్ధంలో సరైన శిక్షణ లేదు. వారిలో ఆత్మస్థయిర్యం కూడా తక్కువే. అంతేకాకుండా ఆహారం, ఇంధనం వంటి వనరుల కొరత కూడా వారిని వేధిస్తోంది.
దీంతో యుద్ధం చేయకుండా తప్పించుకోవడం కోసం వారు తాము ప్రయాణిస్తున్న వాహనాలకు ఉద్దేశపూర్వకంగా పంక్చర్లు చేస్తున్నారు. ఈ వివరాలను బందీలైన రష్యా సైనికులు చెప్పినట్లు ఆ పెంటగాన్ అధికారి అమెరికన్ మీడియాకు తెలిపారు.
యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ వైపు భారీ యుద్ధ ట్యాంకులు, ఆయుధాలతో కూడిన వాహనాలు బయల్దేరిన సంగతి తెలిసిందే. 40 మైళ్ళ పొడవైన ఈ వాహనాల శ్రేణి దాదాపు పాకుతూ వెళ్తున్నట్లు ప్రయాణించడానికి కారణం కూడా సైనికుల్లో ఆత్మస్థయిర్యం లేకపోవడమేనని ఆ అధికారి తెలిపారు.
ఈ పెంటగాన్ అధికారి చెప్పిన వివరాలు సరైనవేనని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా తెలిపింది. రష్యన్ దళాల రేడియో సందేశాలను పరిశీలించి, ఈ విషయాన్ని చెప్తున్నట్లు తెలిపింది. ఓ బ్రిటిష్ మీడియా సంస్థ కొన్ని వాయిస్ రికార్డింగ్‌లను పోస్ట్ చేసింది. వీటిలో ఉక్రెయిన్‌లోని పట్టణాలపై దాడులు చేయాలంటూ తమకు వచ్చిన కమాండ్ ఆర్డర్లను అమలు చేయడానికి రష్యన్ దళాలు తిరస్కరించినట్లు వెల్లడవుతోంది.
షాడోబ్రేక్ అనే ఇంటెలిజెన్స్ సంస్థ ట్విటర్ వేదికగా 24 గంటల నిడివిగల వాయిస్ రికార్డింగులను పోస్ట్ చేసింది. రష్యన్ దళాల యూనిట్ల మధ్య సమన్వయం ఏమాత్రం లేదని, కొన్ని సందర్భాల్లో వారిలో వారే ఘర్షణ పడుతున్నారని తెలిపింది.
ఉక్రెయిన్‌లో యుద్ధ క్షేత్రంలో ఉన్న రష్యన్ సైనికునికి, ఆయనకు కమాండ్ సెంటర్ నుంచి ఆదేశాలు ఇచ్చే అధికారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు ఓ మెసేజ్‌లో కనిపించింది. ఇక్కడ సాధారణ ప్రజలు ఉన్నారని, వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు తాము ఆయుధాలను ఉపయోగించలేమని క్షేత్ర స్థాయిలో ఉన్న సైనికుడు తన కమాండర్‌కు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది.