రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్మించాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. గత ప్రభుత్వం చేసిన సిఆర్డిఎ చట్టం ప్రకారం పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పింది. దానితో మూడు రాజధానుల పేరుతో అమరావతి నుండి కీలక ప్రభుత్వ యంత్రాంగాన్ని తరలించే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రయత్నాలకు పెద్ద అవరోధం పడినట్లయింది.
పైగా, అమరావతి భూములను రాజధానికి తప్ప వేరే అవసరాలకు వినియోగించుకోవద్దని కూడా స్పష్టం చేసింది. ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్‌ప్లాన్ అమలు చేయాల్సిందేనని పేర్కొంది. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు కోర్టుకు తెలియజేయాలని తెలిపింది. రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడు నెలల్లోగా అందజేయాలని ఆదేశించింది. ఆరు నెలల్లో ఒప్పందం ప్రకారమే రాజధానిగా అమరావతిని అభివృద్ది చేయాలని తీర్పునిచ్చింది.
కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాజధాని పిటిషన్లపై విచారణకు అంగీకరించిన హైకోర్టు మొత్తం 70 పిటిషన్లపై గురువారం ఉదయం త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని ఒకింత జగన్ సర్కార్‌కు కోర్టు మొట్టికాయలేసింది.
భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోర్టు తేల్చి చెప్పింది. ఆరు నెలల్లో ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలని సర్కార్‌కు కోర్టు సూచించింది. అంతేకాదు మూడునెలల్లోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని ధర్మాసనం గడువు కూడా విధించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టత ఇచ్చింది.
మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ఇంత భంగపాటుకు గురైన తర్వాత బిల్లు పెట్టే సాహసం చేస్తుందని అనుకోవడం లేదని చెప్పారు. ఇది అమరావతి రైతుల నైతిక విజయమని తెలిపారు.
ఆనాడు శాసనమండలిలో నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపామని చెప్పారు. అయితే తన నిర్ణయాన్ని ప్రభుత్వం తప్పు పట్టిందని గుర్తు చేశారు. ఈ తీర్పుతో మొదటి నుంచి టీడీపీ వాదన కరెక్ట్‌అని తేలిందని షరీఫ్ పేర్కొన్నారు.
రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. ముందు నుంచి టీడీపీ మూడు రాజధానులు బిల్లు చెల్లదని చెబుతూనే ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం తీసుకొని, మూడు రాజధానులపై ముందుకు వెళ్ళిందని మండిపడ్డారు. హైకోర్టు తీర్పుతో నైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆయన హితవు పలికారు.
రాజధాని వివాదాలకు ముఖ్యమంత్రి స్వస్తి పలకాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హితవు చెప్పారు. సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ, అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.