ప్రజాప్రతినిధులు ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండటం ద్వారా చట్టసభల వంటి ప్రతిష్టాత్మక సంస్థల గౌరవాన్ని, పవిత్రను కాపాడాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని చెప్పారు.
గోవా రాజ్ భవన్ ఆవరణలో అత్యాధునిక హంగులతో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరాన్ని (దర్బార్ హాల్ ను) ఉపరాష్ట్రపతి ప్రారంభిస్తూ చట్టసభల్లో చోటు చేసుకుంటున్న అంతరాయాలు, ఇతర పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. విమర్శలు చేసేందుకు ప్రజాప్రతినిధులకు అన్ని రకాల హక్కులు ఉన్నాయన్న ఆయన, అదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యలు మానుకోవాలని హితవు చెప్పారు.
ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధమైన సంస్థలను గౌరవించి, వాటి గౌరవాన్ని కాపాడుకోవాలని స్పష్టం చేశారు. అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉందన్న ఉపరాష్ట్రపతి, శాంతియుతమైన ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న ఎవరికైనా అధికారాన్ని చేపట్టే హక్కు ఉంటుందని, అదే సమయంలో ప్రజలు అవకాశం ఇచ్చే వరకూ ఓపికతో ఎదురు చూడడం మంచిదని హితవు చెప్పారు.
ప్రజా ప్రతినిధులందరూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, మహనీయులు కలలు గన్న నవ భారతాన్ని నిర్మించేందుకు ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. స్వరాజ్యం సముపార్జించుకుని 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా అక్కడక్కడ పేదరికం, నిరక్షరాస్యత, ప్రాంతీయ అసమానతలు, సామాజిక – లింగ వివక్షలను దేశం ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా పేదల జీవితాల్లో వెలుగులు తీసుకురావడం, మహిళా సాధికారతను సాధించడం ద్వారా భారతదేశాన్ని బలమైన, స్థిరమైన, సంపన్న దేశంగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరమని చెప్పారు. సాంస్కృతిక వైవిధ్యానికి చిరునామా అయిన భారతదేశంలోని ప్రతి ఒక్కరూ తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలన్న ఉపరాష్ట్రపతి, ముఖ్యంగా ప్రకృతి అందాలకు నెలవైన గోవా సంస్కృతి మరింత ప్రత్యేకమైనదని పేర్కొన్నారు.
భారతదేశ పర్యాటక ప్రదేశాల్లో గోవాకు ప్రత్యేకత స్థానం ఉందని తెలిపారు. తాజాగా నిర్మించిన దర్బార్ హాల్ నిర్మాణం గోవా సంస్కృతిని ప్రతిబింబిస్తోందన్న ఉపరాష్ట్రపతి, 800 మంది కూర్చునే విధంగా రాజ్ భవన్ పరిసరాల్లో నిర్మించిన గోవాలోని రెండో అతిపెద్ద సమావేశ భవనం అనేక అధికారిక కార్యక్రమాలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, ప్రతిపక్ష నాయకుడు దిగంబర్ కామత్ తదితరలు పాల్గొన్నారు.