పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా మాట్లాడిన షెకావత్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలోనే ఈ ప్రకటన చేశారు.
ఏపీకి జీవనాడిగా పోలవరాన్ని అభివర్ణించిన షెకావత్ జాతీయ హోదా కలిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని ప్రకటించారు. రెండు రోజుల ఏపీ పర్యటనకు వచ్చిన షెకావత్ శుక్రవారం ఉదయం జగన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు నిర్వాసిత కాలనీలను కూడా ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన షెకావత్.. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిశీలించానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక్కొక్క రాయికి అయ్యే ఖర్చును చెప్పిన ప్రకారమే కేంద్రం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని తెలిపారు.
ప్రాజెక్టుకు సవరించిన అంచనాల విషయంలో రాష్ట్రం ఇవ్వాల్సిన వివరాలు ఇవ్వటం లేదని.. పేర్కొంటూ వివరాలు ఇచ్చిన తర్వాత నిధులను ఆమోదించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ప్రాజెక్టు ముంపు బాధితులు ప్రత్యక్ష నగదుబదిలీ పథకం ద్వారా పరిహారాన్ని ఇవ్వాలంటూ సీఎం చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రి అంగీకరించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను అక్కడే ఆదేశించారు. దిగువ కాఫర్‌డ్యాం, ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం వద్ద కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చడంపై, నిర్మాణాలు పటిష్టంగా చేయడంపై వెంటనే డిజైన్లు ఖరారు చేయాలని, ఈ విషయంలో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
దేశంలో, లేదా దేశం వెలుపల నిపుణులైన సంస్థల సేవలను వినియోగించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 15 రోజుల్లోగా దీన్ని కొలిక్కి తీసుకు రావాలని పీపీఏ సహా అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కోరినట్టుగా పోలవరం ప్రాజెక్టుపై ప్రతి 15 రోజులకోసారి వచ్చే మూడు నెలలపాటు సమీక్ష చేస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీతో పాటు, సంబంధిత అధికారులు దీనికి హాజరుకావాలని ఆదేశించారు. పోలవరం పనుల ప్రగతిపై ఒక డ్యాష్ బోర్డ్‌ని ఏర్పాటు చేయాలని, దీనివల్ల ఎప్పటికప్పుడు ప్రగతి తెలుస్తుందని పెక్రోన్నారు.
పునరావాస పనులపై అధికారులు మరింత దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు. నిర్వాసితులకు కేంద్ర సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని, వారి జీవనోపాధిపై కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో రూ.6.8 లక్షల నుంచి 10 లక్షలు ఇస్తామన్న మాట బెట్టుకుంటామని చెబుతూ వైఎస్ హయాంలో భూసేకరణలో ఎకరం లక్షన్నరకే ఇచ్చిన వారికి రూ.5 లక్షలు ఇస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.