మనిషికి ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియని పరిస్థితి. అనారోగ్యం పాలైనప్పుడే కాదు.. అత్యవసర పరిస్థితుల్లో రోగి ఆరోగ్య పరిస్థితి తెలియక చికిత్స అందించడంలో ఆలస్యం అవుతుంది. ఇది ఒక్కోసారి మనిషి ప్రాణాల మీదకు తెస్తుంది. ఈ సమస్యని కట్టడి పెట్టేందుకు తెలంగాణ సర్కారు హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు చేపట్టింది.
హైల్త్ ప్రొఫైల్‌లో భాగంగా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని సేకరించనున్నారు. ఆ వివరాలను ఆన్లైన్లో పొందుపరిచి సదరు వ్యక్తికి ఈ హెల్త్ కార్డు జారీ చేయనున్నారు. హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనలో భాగంగా జిల్లా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యక్తుల ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరును యాప్‌లో ఎంటర్ చేస్తారు.
దీంతో అప్పటికప్పుడు సదరు వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత అందులో సదరు వ్యక్తి ఎత్తు, బరువు నమోదు చేస్తారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు, సర్జరీల వివరాలు, బీపీ, షుగర్, టీబీ, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఆ వివరాలను యాప్‌లో పొందుపరుస్తారు.
రక్త నమూనాలను సేకరించి సీబీపీ, సీబీసీ, రుమటైడ్ ఫ్యాక్టర్, షుగర్, హెచ్ఐవీ, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ తదితర 30 పరీక్షలు నిర్వహించి ఆ నివేదికలను ఆయా వ్యక్తుల హెల్త్ ప్రొఫైల్ అకౌంట్లో అప్లోడ్ చేస్తారు. భవిష్యత్తులో ఏవైనా సమస్యలు తలెత్తితే హెల్త్ ప్రొఫైల్‌ను తనిఖీ చేసి వెంటనే అవసరమైన చికిత్స అందించే అవకాశముంటుంది.
కేంద్రం చేపట్టిన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌లో భాగంగా హెల్త్ అకౌంట్లను క్రియేట్ చేయనున్నారు. కేంద్రం అందుబాటులోకి తెచ్చిన ఈ పోర్టల్‌నే రాష్ట్రం హెల్త్ ప్రొఫైల్ కోసం వాడుకోనుంది. వ్యక్తులు స్వయంగా హెల్త్ అకౌంట్‌ను వెబ్సైట్లో క్రియేట్ చేసుకునే వెసులుబాటును ఈ పోర్టల్ కల్పిస్తుంది.
ఈ హెల్త్ కార్డ్‌లో ఆధార్ నంబర్‌లాగే .. ఒక యూనిక్ నంబర్ అలాట్ చేస్తారు. ఇదే హెల్త్ అకౌంట్ నంబర్ లేదా హెల్త్ ఐడీగా ఉపయోగపడుతుంది.
ఏదైనా హాస్పిటల్ వెళ్లినప్పుడు ఈ ఐడీ చెబితే సరిపోతుంది. ఒకవేళ ఐడీ లేకపోతే… సదరు వ్యక్తి వివరాలు తీసుకుని హాస్పిటల్ వాళ్లే ప్రొఫైల్ క్రియేట్ చేసేలా యాజమాన్యాలు, డాక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ములుగు జిల్లా కలెక్టరెట్ లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభిస్తూ దేశంలోనే ఇది ఎక్కడా జరగలేదని చెప్పారు. తెలంగాణ ఆరోగ్య రంగ ముఖ చిత్రాన్ని మార్చేందుకు, ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆలోచనతో రూపొందించిన ప్రాజెక్ట్ అని తెలిపారు.
హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు ను ములుగు, సిరిసిల్లలో ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు. రెండు జిల్లాల్లో 40 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెబుతూ 18 ఏళ్లకు పైబడినవారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3.80 లక్షల మంది, ములుగు జిల్లాలో 2.60 లక్షల మంది ఉన్నారని వివరించారు.
రెండు జిల్లాలకు కలిపి మొత్తం 420 పైగా బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఒక ఎఎన్ఎం, ముగ్గురు ఆశా కార్యకర్తలు ఉన్నారు. ఒక్కో బృందం ఒక రోజుకు కనీసం 40 మందికి పరీక్షలు చేస్తారని, ఇలా 40 రోజుల్లో రెండు జిల్లాల్లో సర్వే పూర్తయ్యేలా లక్ష్యం పెట్టుకున్నారు.
ఇందుకోసం రెండు జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, ప్రాథమికంగా రూ.10 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని హరీష్ రావు వివరించారు. శాంపిళ్లను పరీక్షించేందుకు సిరిసిల్ల జిల్లాలో రూ.6.20 కోట్లు, రూ.9.03 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసిందని చెప్పారు.
ఈ హెల్త్ ప్రొఫైల్ తో అనేక లాభాలు ఉన్నాయని, ఎక్కడ వైద్యం కోసం వెళ్లినా రిపోర్టులు, డాక్యుమెంట్లు పట్టుకెళ్లాల్సిన అవసరం లేదని, అక్కడ ఈ హెల్త్ ప్రొఫైల్ ను చూస్తే చాలు అని, ఆ వ్యక్తి ఆరోగ్య సమాచారం మొత్తం డాక్టర్ కు తెలిసిపోతుందని వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఒక్క కార్డుతో ఆరోగ్య సమస్యలు తక్షణం తెలుసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్డులు అందించడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.