నిజాలను నిక్కచ్చిగా, వాస్తవాలకు తమ అభిప్రాయాలను జోడించకుండా ఉన్నదున్నట్లుగా చేరవేయడమే ఉత్తమ పాత్రికేయం అన్న ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సంపాదకీయాల ద్వారా తమ భావాలను జోడిస్తూ.. మిగిలిన వార్తలను యథావిధిగా అందించాల్సిన అవసరం ఉందని హితవు చెప్పారు. పత్రికలు సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలన్న ఆయన… వార్తలు, వ్యక్తిగత అభిప్రాయాలు కలిపి ప్రచురించరాదని దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్ లో ‘శ్రీ ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరిస్తూ ప్రభుత్వ విధానాల్లో ఏవైనా లోపాలంటే వాటిని ఎత్తిచూపిస్తూ మార్పులను సూచించాల్సిన బాధ్యత కూడా మీడియాపై ఉందని తెలిపారు. అదే సమయంలో చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపిస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం సరికాదని స్పష్టం చేసారు. ఈ సమాజంలో మనం కూడా భాగస్వాములమనే విషయాన్ని పాత్రికేయులు గుర్తుంచుకోవాలని సూచించారు.
మనం రాసే ఒక్కొక్క అక్షరం మన తోటి సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయాన్ని బేరీజు వేయగలగాలని పాత్రికేయ మిత్రులకు సూచించారు. అక్షరంపై సంపూర్ణ సాధికారత ఉన్న వారే జర్నలిజం రంగంలో ప్రత్యేకతను చాటుకుంటారని పేర్కొన్నారు. ఇందులో నాటి కృష్ణా పత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు మొదటి వరసలో నిలుస్తారని ఉపరాష్ట్రపతి కొనియాడారు.
ఈ సందర్భంగా తెలుగు పాత్రికేయ చరిత్రలో వ్యాసరచనకు నూతన ఒరవడి ప్రవేశపెట్టిన ముట్నూరి కృష్ణారావుకు ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. పత్రికలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేమని చెబుతూ మనిషి జీవిత విధానాన్ని, ఆలోచన క్రమాన్ని సరైన మార్గంలో పెట్టగల శక్తి పత్రికలకు ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. అయితే ఈ శక్తిని సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కూడా పత్రికలకు ఉండాలని స్పష్టం చేశారు.
స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజలకు మార్గదర్శనం చేయడం, దేశవ్యాప్తంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు కింది స్థాయి వరకు తెలియజేయడంలో పత్రికలు ఎంతగానో కృషిచేశాయన్న ఉపరాష్ట్రపతి, ముఖ్యంగా బ్రిటిషర్ల పాలనా కాలంలో యువతలో దేశభక్తిని నూరిపోసి, స్వరాజ్య కాంక్షను రేకెత్తించి జాతీయోద్యమం దిశగా ముందుకు నడిపించేందుకు కృషి చేసిన పత్రికల్లో తెలుగునాట కృష్ణా పత్రికకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.
దాదాపు 4 దశాబ్దాలపాటు కృష్ణా పత్రిక సంపాదకీయం ద్వారా ముట్నూరి వారు ప్రవేశపెట్టిన ఒరవడే తర్వాతి తరం పాత్రికేయులకు మార్గదర్శనం చేసిందని చెప్పారు. మొండివారు అని పేరుగాంచిన వారి సంపాదకీయాలు అధ్యయన గ్రంథాలు అని చెప్పడం అతిశయోక్తి కాదని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, శాంతా బయోటెక్ చైర్మన్ డా. వరప్రసాద్ రెడ్డి, రచన టెలివిజన్ వ్యవస్థాపక చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, వల్లీశ్వర్, రచయిత దత్తాత్రేయ శర్మ తదితరులు పాల్గొన్నారు.