* రెండు రాష్ట్రాల బిజెపి కమిటీలలో ప్రక్షాళన
* మార్చ్ 15 తర్వాత తెలుగు రాష్ట్రాలపై దృష్టి
* పెద్ద రాష్ట్రాల్లో కోల్పోయే సీట్ల భర్తీకి వ్యూహం
బిజెపి అగ్ర నేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపి వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలకు చెందిన బిజెపి లోని వివిధ వర్గాల వారితో ఆయన సవివరంగా చర్చలు జరిపినట్లు తెలిసింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు పూర్తయిన తర్వాత, మార్చ్ 15 అనంతరం ఈ విషయాలపై లోతుగా మాట్లాడదామని వారికి చెప్పిన్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ధోరణి చూస్తే ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ బిజెపి పెద్ద సంఖ్యలో లోక్ సభ సీట్లను కోల్పోయే అవకాశాలున్నట్లు సంకేతం వస్తున్నది. అటువంటి పరిష్టితులే బిజెపికి అత్యధిక ఎంపీ సీట్లున్న మధ్య ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాలలో కూడా ఉన్నట్లు భావిస్తున్నారు.
2014లో తిరిగి 300 సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ప్రస్తుతం బిజెపికి బలం లేని, చెప్పుకోదగిన లోక్ సభ సీట్లులేని రాష్ట్రాలపై అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశాలున్నట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి.
ఈ వ్యూహంలో భాగంగా, రెండు తెలుగు రాష్టాలలో బిజెపికి సొంతంగా వచ్చే సీట్లతో పాటు మిత్ర పక్షాలతో కలుపుకొని 30 సీట్లు రావాలని అమిత్ షా చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో మాత్రమే బిజెపికి 4 సీట్లున్నాయి. ఏపీలో ఒక్క సీట్ కూడా లేదు. కేవలం ఏపీలో మాత్రమే జనసేన మిత్రపక్షంగా ఉంది. తెలంగాణాలో బిజెపి ఒంటరిగా పోటీ చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.
30 సీట్లు గెలుపొందాలంటే అనుసరింప వలసిన వ్యూహం గురించి ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలు ఆయన ముందున్నట్లు తెలిసింది. మొండిగా ఈ రెండు రాష్ట్రాలలో పార్టీ నాయకత్వంలలో భారీ ప్రక్షాళన చేయాలని ఆయనకు పలువురు సూచించినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఉన్న రాష్ట్ర కమిటీలలో ఉన్నవారెవ్వరు క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయగలిగిన వారు లేరు. ఓటర్లను ఆకట్టుకోవడం అటుంచి, కనీసం పోలింగ్ యంత్రాంగం సమర్ధవంతంగా నిర్వహించగల్గిన వారు కూడా లేరు. తమకంటూ సొంత నియోజకవర్గం ఉన్నవారు ఒకరిద్దరుకు మించి లేరు.
కనీసం ఈ రెండు రాష్ట్రాలలో గల 42 నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులు, తమకంటూ ఒక నియోజకవర్గం గల వారు లేరు. పైగా, ప్రస్తుతం ఇక్కడున్న నాయకత్వం క్షేత్రస్థాయిలో పట్టుగల నాయకులను దూరంగా ఉంచుతున్నారని ఆరోపణలు అమిత్ షా దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా సీనియర్లను, ఇతర పార్టీల నుండి వచ్చిన ప్రముఖులను కలుపుకు పోవడం లేదనే విమర్శలున్నాయి.
ఏకపక్ష ధోరణుల కారణంగా పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడగలదనే ఆందోళనలను పలువురు అమిత్ షా వద్దనే వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది. ఏపీలో అయితే నోటా ఓట్లకన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకొనే ప్రయత్నాలు జరుగుతున్న దాఖలాలు లేవు. “మనం క్షేత్రస్థాయిలో మన ఉనికి నిరూపించుకొంటేనే రేపు ఎన్నికలలో ఎవరైనా మనతో పొత్తుకు వస్తారు” అని ఒక ప్రముఖ నాయకుడు అమిత్ షాకు స్పష్టం చేసిన్నట్లు తెలిసింది.
గతంలో పార్టీలో ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా నలుగురు ప్రముఖ నాయకులు కలసి, చర్చించి తీసుకొనేవారు. కానీ ఇప్పుడు ఆ విధమైన సమాలోచనలు జరగడం లేదు. అందుకనే తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షునికి వ్యతిరేకంగా కొందరు బహిరంగంగానే సమావేశాలు జరిపే పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయమై పలువురు ప్రముఖ నాయకులు తెలుగు రాష్ట్రాలలో అమిత్ షా తరచూ సంప్రదింపులు జరుపుతున్నారు. సమిష్టిగా, వ్యూహాత్మకంగా పనిచేయాలని, కేవలం మీడియా ఈవెంట్ లకు పరిమితమైతే ఎన్నికలలో ఎటువంటి ప్రభావం చూపింపలేమని ఆయనకు స్పష్టం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలలో బిజెపిలో నెలకొన్న పరిష్టితులను కొందరు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి కూడా తీసుకు వచ్చిన్నట్లు తెలిసింది. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ ఇన్ ఛార్జ్ గా వచ్చిన ప్రస్తుతం కేంద్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగతం) బి ఎల్ సంతోష్ కు కూడా ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ పరిస్థితులలో రాబోయే కొద్దీ నెలల్లో రెండు రాష్ట్రాలలో బిజెపి ప్రక్షాళనకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. డిసెంబర్ లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఉన్నందున ఈ లోపుగానే తెలుగు రాష్ట్రాలపై అమిత్ షా కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.