ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీపై ఒక వంక అంతర్జాతీయంగా, స్వదేశంలోని కూడా వత్తిడి పెరుగుతున్నది. ముఖ్యంగా అమెరికా నుంచి ఈ విషయమై ఒత్తిడి పెరుగుతున్నట్లు దౌత్యరంగ నిపుణులు తెలిపారు.
రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి తీర్మానంపై ఓటు వేసేందుకు భారత్ నిరాకరించిన సంగతి తెలిసిందే. రెండు సందర్భాలలో భారత్ ఓటింగ్ కు దూరంగా ఉంది. ఆ తర్వాత ఐరాస మానవ హక్కుల సంస్థ నిర్వహించిన సమావేశానికి కూడా భారత్ గైర్హాజరైంది. భారత్ తో పాటి చైనా, పాకిస్థాన్ కూడా ఓటింగ్ కు దూరంగా ఉండడం గమనార్హం.
ఈ నేపథ్యంలో నిర్ధిష్టమైన వైఖరి తీసుకోవాలని, రష్యా దాడిని ఖండించాలంటూ భారత్‌పై వాషింగ్టన్ ఒత్తిడి పెంచుతోందని అమెరికా సీనియర్ దౌత్యవేత్త డొనాల్డ్ లూ తెలిపారు. ఐరోపా దేశాల నుండి కూడా ఈ విషయమై భారత్ పై వత్తిడులు ఎదురవుతున్నాయి. భారత్, చైనా ఒక వైఖరి తీసుకోవాలని బ్రిటన్ అధ్యక్షుడు బోరిస్ జూన్సన్ కోరారు.
భారత రక్షణ దిగుమతుల్లో 50 శాతం పైగా రష్యా నుంచే వస్తున్నాయి. ఇరుదేశాల మధ్య సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటు అమెరికాకు జూనియర్ భాగస్వామిగా కొనసాగుతున్నందున ఇటు రష్యాను, అటు నాటోను కాదనలేక భారత్ తటస్ట వైఖరి కొనసాగిస్తోంది.
అంతే అంతర్జాతీయ నాయకత్వం కోరుకొంటున్న దేశం ఆ విధంగా తటస్థంగా ఉండడం సరికాదనే వాదనలు బయలుదేరుతున్నాయి. ఓటింగ్ కు దూరంగా ఉన్నా ఐరాసలో రష్యా దురాక్రమణకు ఖండిస్తూ, వెంటనే కాల్పులు నిలిపివేయమని రష్యాకు విజ్ఞప్తి చేసిఉంటే భారత్ ప్రతిష్ట ఇనుమడించి ఉండేదని భారత దేశంలోని పలువురు అంతర్జాతీయ నిపుణులు సహితం భావిస్తున్నారు.
విస్మయకరంగా, అధికార బిజెపి, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటు భారత దేశంలోని రాజకీయ పక్షాలు ఏవీ ఉక్రెయిన్ యుద్ధంపై స్పష్టమైన విధానం తీసుకోలేదు. దాదాపు మౌనంగా ఉంటున్నాయి. కేవలం అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశంకు తీసుకు రావడం గురించే మాట్లాడుతున్నాయి. కేవలం వామపక్షాలు మాత్రమే స్పష్టమైన విధానం తీసుకున్నాయి.
ఉక్రెయిన్ లో ప్రస్తుత దుస్థితికి అమెరికా, ఐరోపా దేశాల విధానాలే కారణమని విమర్శిస్తూ, రష్యా దాడిని కూడా ఖండించాయి. రష్యా వెంటనే కాల్పుల విరమణ జరపాలని పిలుపిచ్చాయి.
గతంలో ఐరాసలో పనిచేసిన మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశి థాపర్ మాత్రమే ఉక్రెయిన్ సంక్షోభంపై స్పష్టమైన ప్రకటన చేశారు. తటస్థ వైఖరి అనుసరించడం ద్వారా భారత్ అంతర్జాతీయ వ్యవహారాలలో `నైతిక నాయకత్వం’ పొందలేదని స్పష్టం చేశారు. రష్యాతో మనకు ఎంత వ్యూహాత్మక సంబంధాలు ఉన్నప్పటికీ ఉక్రెయిన్ పై దాడిని ఖండించ వలసిందే అని స్పష్టం చేశారు.
ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు రామ్ మాధవ్ ఇటీవల ఓ పత్రికలో ఈ విషయమై రాసిన వ్యాసంలో ‘భారత్ తన తటస్ఠ వైఖరిని ఎంతకాలం కొనసాగిస్తో చూడాలి’ అని పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం. ప్రపంచ ప్రజాభిప్రాయం పుతిన్ చర్యకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.