రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం 13వ రోజుకు చేరింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఖార్కివ్‌లో నిన్న రష్యా మేజర్ జనరల్ విటాలీ గెరసిమోవ్‌ను హతమార్చినట్టు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
రష్యా దళాల ఆధిపత్యంలోకి వెళ్లిన కీవ్ నగర సమీపంలో ఉక్రెయిన్ దళాలు రష్యా సేనలపై విరుచుకుపడ్డాయి. రష్యా దళాలపై ఊహించని రీతిలో ఉక్రెయిన్ దళాలు ప్రతిదాడులకు దిగాయి. ఎదురు కాల్పులు చూసి ఉలిక్కిపడ్డ రష్యా దళాలు తేరుకునేలోపే భారీ మూల్యం చెల్లించుకున్నాయి.
మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్ రష్యాలోని సెంట్రల్ మిలిటరీ డిస్ట్రిక్ట్ 41వ సైన్యానికి మొదటి డిప్యూటీ కమాండర్. రెండో చెచెన్ యుద్ధం, సిరియాలో జరిగిన రష్యన్ సైనిక కార్యకలాపాలలో విటాలీ కీలక పాత్ర పోషించారని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.
అంతేకాదు, 2014లో క్రిమియాను తిరిగి సొంతం చేసుకున్నందుకు ఆయనకు మెడల్ కూడా లభించింది. కాగా, ఈ యుద్ధంలో రష్యాకు చెందిన చాలామంది రష్యన్ సీనియర్ అధికారులు మరణించడమో, గాయపడడమో జరిగిందని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ సైన్యం చేతిలో రెండో మేజర్ జనరల్ చనిపోయాడు.
కాగా, ఇప్పటి వరకు లక్షా 68 వేల మంది పౌరులు రష్యాకు వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తెలిపింది. నిన్న ఒక్కరోజే 5,550 మంది వలస వెళ్లినట్లు తెలిపింది. ఉక్రెయిన్ నుంచి వస్తున్న శరణార్థుల కోసం తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు రష్యా తెలిపింది. మొత్తం 16 లక్షల మందికిపై ఉక్రెయిన్ వీడారని అధికారులు తెలిపారు.
ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లోని సుమీలో చిక్కుకుపోయిన 700 మంది భారతీయుల తరలింపుకు బ్రేక్ పడింది. శనివారం నుంచి తరలింపు కోసం ఎదురుచూస్తున్న మన విద్యార్థులు రవాణా లేకపోవడంతో అక్కడే ఉండిపోయారు. ఇదే క్రమంలో బాంబు దాడులు కొనసాగుతుండటంతో వాళ్లను సరిహద్దు దాటించాలన్న ప్రయత్నం నిలిచిపోయిందని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది.
మన వాళ్లందరినీ భద్రంగా తరలించేందుకు సహకరించాలని రష్యాను కోరింది. కీవ్ నుంచి బెలారస్‌కు, ఖార్కివ్ నుంచి రష్యాకు విద్యార్థుల తరలింపుకు సాయం చేస్తామని రష్యా అంగీకరించింది.
ఉక్రెయిన్ నుంచి 16వేల మందికి పైగా విద్యార్థులను భారత్ కు తీసుకొచ్చామని కేంద్రమంత్రి మురళీధరన్ చెప్పారు. మరో మూడు వేల మంది విద్యార్థులను తరలించాల్సి ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల తరలింపునకు భారత విదేశాంగశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.