ప్రపంచవ్యాప్తంగా మహిళలకు అంతర్జాతీయ మహిళాదినోత్సవం వేడుకగా సాగిన దశలో ఉక్రెయిన్‌లో సైన్యంలోని మహిళలు భుజాన తుపాకులతో వీరోచిత పోరు సంకల్ప బలంతో ముందుకు సాగారు. రష్యా అతిక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ దళాలు సాగిస్తున్న పోరులో ఈ అసాధారణ మహిళల బృందం పోరులో తాము ముందుండి సాగుతున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈ మహిళా సైనికుల స్ఫూర్తి వారి పోరాట పటిమ అంతర్జాతీయ స్థాయిలో అందరి మన్ననలు పొందింది. మహిళా సైనికుల ఫోటోలు ఆన్లైన్లో వెలువడ్డాయి. వారు సైనిక దుస్తులలో చేతులలో రైఫిల్స్‌తో కన్పించారు. శత్రువును తుదముట్టించే పోరులో తాము తమ వంతు పాత్రను ఎవరికి తీసిపోకుండా నిర్వరిస్తామని ఈ సందర్భంగా ఓ సైనికురాలు ధైర్యంగా తెలిపారు.
తమ నేల ఇక్కడి ప్రజలను కాపాడుకునేందుకు తాము మగవారిని సైన్యంలోకి పంపించామని, వీరితో పాటు తాము కూడా ముందుకు వెళ్లుతున్నామని తెలిపారు. తమ పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. ముందు వారి ప్రాణాలను కాపాడటం తమకు ప్రధానమని తెలిపారు.
ఇక్కడి జన్యుక్రమాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉంది. ఉక్రెయిన్‌లోని అంగుళం అంగుళం మేర శత్రువును నాశనం చేసి తీరుతామని ప్రకటించారు. ఇక్కడి గృహాలు శిథిలం కావచ్చు, జీవన పథంలో త్రోటుపాటు కన్పించవచ్చు, వీధులు రక్తసిక్తం అయి ఉండొచ్చు, అయితే అన్ని వైపుల నుంచి ఇక్కడి ప్రజలు మొక్కవోని ధైర్యం ఆయుధంగా చేసుకుని ఆక్రమణకు దిగుతోన్న శత్రువును దెబ్బతీయడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుండగా, ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఓలెక్సీ రెజ్నికోవ్ విడుదల చేసిన ప్రకటనలో, రష్యా యుద్ధం వల్ల దాదాపు 400 మంది సాధారణ ప్రజలు మరణించినట్లు, సుమారు 800 మంది గాయపడినట్లు తెలిపారు. ఇది ఓ అంచనా మాత్రమేనని, పూర్తి వివరాలు తెలియవలసి ఉందని చెప్పారు. రష్యా దళాల బాంబు దాడుల్లో సుమారు 200 పాఠశాలలు, 34 ఆసుపత్రులు, 1,500 నివాస భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు.
రష్యా బందీలుగా 3 లక్షల మంది పౌరులు
ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రి డిమిట్రో కులేబా మాట్లాడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించిందని ఆరోపించారు. రష్యా సైన్యం చుట్టుముట్టిన మరియుపోల్ నగరంలో రష్యన్ సేలను 3 లక్షల మంది పౌరులను నిర్బంధించాయని ఆరోపించారు.
చాలా రోజులు వారికి నీళ్లు, ఆహారం అందడం లేదని, దీంతో చిన్నారి డీహైడ్రేషన్‌తో మరణించినట్టు చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే రష్యా యుద్ధ నేరాలకు పాల్పడతోందని, అది కూడా వారి వ్యూహంలో భాగమని ట్వీట్ చేశారు.