వైసిపిలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మరో రెండేళ్ల తర్వాత జరుగవలసిన అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుండే ప్రచార సన్నాహాలలో మునిగేవిధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. మంత్రులు, ఎమ్యెల్యేలు వచ్చే మే నుండి ఎక్కువగా జనం మధ్యనే ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.
సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో విడిగా సమావేశమైన ఆయన ఈ విషయమై సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. మే నెల నుంచి అందరం రోడ్ల మీదకు రావాలని.. ఇంటింటికీ వెళ్లి ప్రజలందరికీ చేరువ కావాలని మంత్రులకు స్పష్టం చేసినట్లు తెలిసింది.
వీలైనంత త్వరలోనే వైఎస్సార్ఎల్పీ సమావేశం నిర్వహించి, ఎమ్మెల్యేలకు భవిష్యత్ కార్యాచరణ వివరిస్తానని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు.ప్రజల వద్దకు వెళ్లే ముందు వారికి సేవలందిస్తున్న వాలంటీర్లకు సన్మాన కార్యక్రమాలను ఏప్రిల్లో నిర్వహించాలని సిఎం జగన్ చెప్పినట్లు సమాచారం.
మంత్రులంతా వారానికి 3 రోజులకు తగ్గకుండా పార్టీకి సమయం కేటాయించాలని సిఎం స్పష్టం చేశారు. ‘ వచ్చే రెండేళ్లలో ఏమేం చేద్దాం ? ‘ ఎలాంటి కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళదాం అనేది అతి త్వరలో శాసనసభాపక్ష సమావేశంలో దిశా నిర్దేశం చేసుకోవాలని, జులైలో పార్టీ ప్లీనరీ నిర్వహించుకోవాలని, అప్పటికే అందరూ ప్రజల్లోకి వెళ్లాలని మంత్రివర్గ సహచరులకు సిఎం చెప్పినట్లు తెలుస్తోంది.
అధికారంలోకి వచ్చిన 33 నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని చెప్పారు. కరోనా ప్రతికూల పరిస్థితుల వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ, సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలును ప్రజలకు వివరించాలని సూచించారు. గడప గడపకూ వెళ్లి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించాలని ఉద్బోధించారు. చేసిన అభివృద్ధిని వివరించి, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు.
అభివఅద్ధి పనులు చాలా కాలంగా పెండింగులో ఉన్నాయని కొంతమంది మంత్రులు ప్రస్తావించగా, దానికి పరిష్కారంగానే నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున అభివఅద్ధి నిధులు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని గ్రామాలన్నింటినీ సందర్శించాలని సూచించినట్లు తెలుస్తుంది.
ఈ నెల 10 న మధ్యాహ్నం అసెంబ్లీలోని కమిటీ హాలులో వైసిపి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పార్టీ కార్యాచరణపై ఓ నిర్ణయానికి రానున్నారని, జులై 8 న పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నట్లు వైసిపి వర్గాల సమాచారం.