తన ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని ప్రతిపక్షాలు, ముఖ్యంగా బిజెపి తరచూ విమర్శలు, ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేడు రాష్ట్ర శాసనసభలో 91,142 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నేటి నుండే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని, 80,039 ఉద్యోగాలకు ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్ ఇస్తామని, ఇక నుంచి 95 శాతం స్థానికులకే ఉద్యోగాలని కూడా ప్రకటించారు. లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు.
22 వేల ఉద్యోగుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, లక్షా 56 వేల ఉద్యోగాలను నోటిఫై చేశామని వివరించారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే అవకాశమని కేసీఆర్ చెప్పారు. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్, మల్టీజోనల్, సెక్రటేరియట్, హెచ్ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సిఎం కెసిఆర్ చెప్పారు.
వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. శాశ్వత ప్రతిపాదికన తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం చేస్తామని భరోసా ఇచఃరు. ఉద్యోగులు సంతోషంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతూ దేశంలోనే ఉద్యోగులు అత్యధికంగా వేతనాలు తీసుకుంటున్నరాష్ట్రం తెలంగాణనే అని గుర్తు చేశారు. అసలు ఉద్యోగి కంటే కాంట్రాక్ట్ ఉద్యోగి ఎక్కువ పనిచేస్తాని కొనియాడారు.
శాఖలవారీగా కూడా నేడు నోటిఫికేషన్లు జారీ చేసే ఉద్యోగాలు
పోలీస్ శాఖలో 18,334 పోస్టులు; సెకండరీ విద్యాశాఖలో 13,086, హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ 12, 755 పోస్టులు; ఉన్నత విద్యాశాఖలో 7,878 పోస్టులు; బీసీ సంక్షేమం- 4,311; రెవెన్యూలో 3,560 పోస్టులు; ఎస్సీ డెవలప్ మెంట్ 2,879;ఇరిగేషన్ లో 2,692 పోస్టులు; ట్రైబల్ వెల్ఫేర్ – 2,399; మైనార్టీస్ లో 1,825; ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 1598; పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ 1,455; కార్మికశాఖ 1,221; ఫైనాన్స్ 1,146; సంక్షేమశాఖ 895; మున్సిపల్ 859; వ్యవసాయ శాఖ 801; రవాణా శాఖ 563; న్యాయశాఖ 386; పశుసంవర్ధక శాఖ 353; పరిపాలన శాఖ 343; ఇండస్ట్రీస్ 233;టూరిజం 184; సివిల్ సప్లై 106; అసెంబ్లీ 25; ఎనర్జీ శాఖలో 16. మొత్తం 80,039
గ్రూపుల వారీగా ఖాళీలు గ్రూప్ 1 లో 503; గ్రూప్ 2 లో 582; గ్రూప్ 3లో 1373; గ్రూప్ 4 లో 9168.
యూనిఫాం జాబ్స్ ను మినహాయించి మిగతా జాబ్స్ కు ఉద్యోగుల వయో పరిమితి పెంచుతున్నామని ఆయన ప్రకటించారు. ఉద్యోగాలకు వయో పరిమితిని పదేళ్లకు పెంచుతున్నామని చెప్పారు. ఓసీలకు 44 ఏళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లకు ఏజ్ లిమిట్ పెంచుతున్నామని తెలిపారు.