పంజాబ్ లో అందరి అంచనాలను తలదన్నుతూ ఖనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు పూర్తి జోష్ లో ఉంది. ఢిల్లీ తర్వాత రెండో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఇతర రాష్ట్రాలకు విస్తరించే ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలించలేదు. పంజాబ్ విజయంతో నెలకొన్న ఉత్సాహంతో ఈ సంవత్సరం చివరిలో ఎన్నికలు జరుగనున్న గుజరాత్ వైపు ఆ పార్టీ ఇప్పుడు దృష్టి సారింపనున్నది.
పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం రాబోతున్నట్లు ముందుగానే పలు సర్వేలు వెల్లడి చేయడంతో ఇక దేశంలో కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ ఆ పార్టీ నాయకులు ప్రచారం ప్రారంభించారు. అంతేకాదు, పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను కాబోయే ప్రధానిగా కూడా పేర్కొంటున్నారు. పంజాబ్ ఎన్నికల విజయ ఉత్సవాలను వచ్చే నెలలో గుజరాత్ లో పెద్ద ఎత్తున జరపడం ద్వారా అక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించే సన్నాహాలు చేస్తున్నారు.
డిసెంబర్ లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఆప్ బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. తొలి ప్రయత్నంలోనే అధికారం దక్కకపోయినా, కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా అయినా రాణిస్తామని ఆప్ గుజరాత్ ఇన్చార్జి గులాబ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం గుజరాత్ ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
గుజరాత్లో బీజేపీకి ప్రధాన పోటీగా ఆప్ నిలిచేలా రానున్న తొమ్మిది నెలల్లో కృషి చేస్తామని గులాబ్ సింగ్ తెలిపారు. 27 అక్కడి ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరిస్తూ వస్తుండటం, బిజెపి తిరుగులేని వరుస ఎన్నికల విజయాలను సాధిస్తూ ఉండడంతో రాజకీయంగా తమకు బలమైన మద్దతు లభించగలదని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని మూడో స్థానానికి నెట్టుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా . వచ్చే నెల నుంచే కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌తో కలిసి ఏప్రిల్‌లో భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తామని తెలిపారు.
అట్లాగే డిసెంబర్ లో జరుగబోయే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పట్ల కూడా ఆప్ దృష్టి సారిస్తున్నది. ఈ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలు పంజాబ్ సరిహద్దుల్లో ఉండడంతో కొంత ప్రభావం చూపగలమని భావిస్తున్నారు.
జాతీయ పార్టీగా గుర్తింపు
మరోవంక, ఈ సంవత్సరం చివరకు జాతీయ పార్టీగా గుర్తింపు పొందడంకోసం ఆప్ సన్నాహాలు చేస్తున్నది. లోక్‌సభలో రెండు శాతం స్థానాలను, కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలుచుకున్న పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు లభిస్తుంది.
లోక్‌సభ లేదా రాష్ట్ర శాసన సభల ఎన్నికల్లో కనీసం నాలుగు రాష్ట్రాల్లో పోలైన, చెల్లుబాటైన ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లను పొందాలి. అంతేకాకుండా ఏదైనా రాష్ట్రంలో కనీసం నాలుగు శాసన సభ స్థానాల్లో లేదా లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలవాలి.
గత ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 54 శాతం ఓట్లు లభించాయి. పంజాబ్‌లో 42 శాతం ఓట్లు, గోవాలో 6.77 శాతం సంపాదించింది. ఉత్తరాఖండ్‌లో 3.4 శాతం ఓట్లు, ఉత్తర ప్రదేశ్‌లో 0.3 శాతం ఓట్లు లభించాయి. ఈ పార్టీకి కేవలం ఒక లోక్‌సభ సభ్యుడు భగవంత్ మాన్ ఉన్నారు.
ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసి, సత్ఫలితాలు సాధిస్తే, ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు పొందే అవకాశం దక్కవచ్చు.ప్రస్తుతం మన దేశంలో జాతీయ పార్టీలు : కాంగ్రెస్, బీజేపీ, టీఎంసీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, ఎన్సీపీ.