ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంభంలో విబేధాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపిపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సోదరి వై ఎస్ షర్మిల పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉంటూ, గత ఏడాది తెలంగాణలో ఓ ప్రాంతీయ పార్టీని అన్న అభిష్టంకు వ్యతిరేకంగా ప్రారంభించి, హైదరాబాద్ కే పరిమితమవుతూ వస్తున్నారు.
అయితే కొద్దీ రోజులుగా ఆమె భర్త, ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ లో తిరుగుతూ ఉండడం అధికార పక్షంలో కలకలం రేపుతున్నది. ఏపీలో కూడా మీరు పార్టీ ప్రారంభిస్తారా అని అడిగితే `ఎందుకు ప్రారంభింప కూడదు” అంటూ షర్మిల కొద్దిరోజుల క్రితం సమాధానం ఇవ్వడం గమనార్హం.
స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడిగా పేరొందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను అనిల్ కుమార్ రాజమండ్రిలో `మర్యాదపూర్వకం’గా కలవడం, విజయవాడలో వివిధ వర్గాలతో సమాలోచనలు జరపడం గమనిస్తే రాజకీయ అజెండాతోనే తిరుగుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. గత ఎన్నికలలో వైసీపీకి మద్దతుగా ఉన్న పలు వర్గాలు, ముఖ్యంగా క్రైస్తవులలో ఆయన పాలన పట్ల అసంతృప్తి వ్యర్థం అవుతున్నట్లు ఆయన మాటలను బట్టే వెల్లడి అవుతున్నది.
గత ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపు కోసం పనిచేసిన క్రైస్తవులు ఇప్పుడు ఆవేదనతో ఉన్నారని అనిల్ కుమార్ పేర్కొనడం గమనార్హం. జగన్ పాలనపై వారి అభిప్రాయాలను తనతో చెప్పారని అంటూ జగన్ తనకు రెండేళ్లకు పైగా అపాయింట్మెంట్ ఇవ్వలేదని కూడా చెప్పిన్నట్లు తెలుస్తున్నది. తనకు మరో పార్టీ ప్రారంభించే ఉద్దేశ్యం లేదని అంటూనే త్వరలో శుభవార్త వింటారని చెప్పడం ఆసక్తి కలిగిస్తున్నది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ సంఘాలకు చెందిన ప్రతినిధులతో ఇటీవల ఆయన విజయవాడలో జరిపిన సమాలోచనలలో ఎక్కువగా జగన్ పాలనపై `అభిశంసన’ వ్యక్తం చేసేవిధంగా జరిగింది.
భజన చేసే నాయకులకే జగన్ అపాయింట్మెంట్లు ఇస్తున్నారని, పార్టీ విజయానికి కృషి చేసిన వారిని పక్కన పెట్టారని పలువురు విమర్శించినట్లు తెలుస్తున్నది. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని గత ఎన్నికల్లో ప్రచారం చేసిన అనిల్‌కుమార్ క్రైస్తవ సంఘాలను సమీకరించడంలో కీలక పాత్ర వహించారు.
మరోవంక, జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చురుకుగా కొనసాగుతున్నది. ఈ కేసులో జగన్ కు సన్నిహితుడైన మరో బాబాయి కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిబిఐ ప్రయత్నం చేస్తున్నట్లు కధనాలు వస్తున్నాయి.
ఈ సందర్భంగా ఈ కేసుపై పట్టుబట్టి, సిబిఐ విచారణపై ప్రభావం చూపుతున్నట్లు భావిస్తున్న వివేకానందరెడ్డి కుమార్తె డా. వైఎస్ సునీతపై వైసిపి నేతలు తీవ్రమైన ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. ఆమెను పులివెందుల నుండి జగన్ పై టిడిపి అభ్యర్థిగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయించే ప్రయత్నం జరుగుతున్నదనే ప్రచారం చేస్తున్నారు.
మొత్తానికి ఒక వంక అనిల్ కుమార్ కార్యక్రలాపాలు, మరోవంక సోదరులు షర్మిల, సునీత వ్యవహారం జగన్ కు తలనొప్పిగా తయారవుతున్నట్లు కనిపిస్తున్నది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా కాపాడేందుకు సర్వశక్తులను ధారపోతున్నట్లు చెబుతున్నారు.
గతంలో అవినాష్ రెడ్డిని కడప నుండి పోటీచేయించే విషయంలోనే జగన్ కుటుంభంలో విబేధాలు ప్రారంభమై ఇప్పుడు తీవ్రరూపం దాలుస్తున్నట్లు కనిపిస్తున్నది. 2014లోనే ఇక్కడి నుండి షర్మిల పోటీ చేయాలి అనుకున్నారు. ఆమెను తప్పించడం కోసమే తల్లి వైఎస్ విజయమ్మను విశాఖపట్నం నుండి పోటీచేయించగా, ఆమె ఓటమి చెందారు.
షర్మిల, విజయమ్మలు కానీ పక్షంలో కడప సీట్ తనకే ఇవ్వాలని వివేకానందరెడ్డి పట్టుబట్టారు. వీరంతా అవినాష్ కు సీట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. అవినాష్ కు జగన్ అంతగా ప్రాధాన్యత ఇవ్వడం ఇతర కుటుంభం సభ్యులకు మింగుడు పడటం లేదని స్పష్టం అవుతున్నది.