ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికలకు ప్రతిబింబమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు.ఈ సారి హోలీ మార్చి 10నే మొదలైందన్న మోదీ బిజెపి శ్రేణులకు అభినందనలు తెలిపారు. సుపరిపాలన వల్లే ఈ విజయాలు వచ్చాయని స్పష్టం చేశారు.
ఎన్నికల ఫలితాలు రాగానే గురువారం సాయంత్రం ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవాలలో పాల్గొని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ బిజెపి విజయంలో మహిళలు, యువతది కీలక పాత్ర అని పేర్కొన్నారు.
‘37 ఏళ్ల తర్వాత యుపిలో ఒక పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. యుపి ప్రజలు 2014 నుంచి అభివృద్ధికే ఓటేశారు. 2017 యుపి ఫలితాలు 2019 ఫలితాలను చూపాయి. 2022 ఫలితాలు 2024 ఎన్నికలను చూపాయి’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
యుపి ప్రజలు దేశ విచ్ఛిన్న శక్తులను దూరం పెట్టారని చెబుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న చోట ప్రజాక్షేమమే ధ్యేయంగా పాలన ఉందని చెప్పారు. ఈ ఎన్నికలు చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో జరిగాయని చెబుతూ కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ ఎన్నికలు వచ్చాయని గుర్తు చేశారు.
మనం తీసుకున్న చర్యల వల్ల కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డామని పేర్కొంటూ రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు, ఖాద్య తైలాల ధరలు భారీగా పెరుగుతున్నాయని ప్రధాని గుర్తు చేశారు. ఆత్మనిర్భర్ భా రత్కు బడ్జెట్లో కొత్త శక్తిని అందించామని తెలిపారు.
భవిష్యత్త్తులో పంజాబ్లోను బిజెపి పార్టీ జెండా ఎగురవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. “కోట్ల మంది మహిళామణులు, మాతృమూర్తులే మనకు రక్షణ. తొలి సారి ఓటువేసిన యువత బిజెపికే అండగా నిలిచారు. సంక్షోభ సమయంలో స్థిరమైన ప్రభుత్వానికి అండగా నిలిచారు” అని కొనియాడారు.
దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన సమయం ఇదని చెబుతూ వందేళ్లలో ఎన్నడూ చూడని విపత్తును కరోనా రూపంలో చూశామని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల కరోనా సంక్షోభంనుంచి బయటపడ్డామని తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ను కూడా కొందరు నేతలు ప్రశ్నించారని, ‘ఆపరేషన్ గంగ’ను ఆపేందుకు ప్రయత్నించారని ప్రధాని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. అయితే ప్రజలు ఎప్పుడూ అభివృద్ధి మంత్రాన్నే పఠిస్తారని యుపిలో రుజువైందని సంతోషం వ్యక్తం చేశారు.
పేదలకు ఇల్లు, రేషన్, వ్యాక్సిన్ అందించడమే బిజెపి లక్షం అని స్పష్టం చేస్తూ ఈ దేశంలో అవినీతి అంతం కావాలా? వద్దా? అని ప్రశ్నించారు. ప్రజాధనం దోచుకుని జేబులు నింపుకునే వారిపై చర్యలు తప్పవని ప్రధాని హెచ్చరించారు. ఏదో ఒక రోజు వారసత్వ రాజకీయాలు దేశంలో అంతం కాగలవని మోదీ భరోసా వ్యక్తం చేశారు.
కాగా దేశ రాజకీయాలను మోడీ సమూలంగా మారుస్తున్నారని బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా కొనియాడారు. విజయోత్సవ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని మోదీపై కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. తొలుత కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీతో పాటుగా నడ్డా ప్రధానిని గజమాలతో సత్కరించారు.