ఈ నెల 14న గుంటూరు జిల్లాలో జరుగనున్న జనసేన ఆవిర్భావ సదస్సు ఏపీ రాజకీయాలలో కీలకంగా మారే అవకాశం కనిపిస్తున్నది. ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సదస్సులో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలకమైన ప్రకటన చేయగలరని ప్రచారం జరుగుతున్నది.
ఒక విధమైన రాజకీయ స్తబ్దత నెలకొన్న ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన రాజకీయ శక్తిగా జనసేన ఎదిగే అవకాశాలున్నట్లు పలువురు భావిస్తున్నారు. అధికారపక్షం ఒకవంక అంతర్గత కుమ్ములాటలు, పరిపాలనాపరమైన వైఫల్యాలు, ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తితో సతమతమవుతూ ఉండగా, అధికార పక్షంను ధీటుగా ఎదుర్కోగల సత్తా ప్రధాన ప్రతిపక్షం టిడిపిలో కనిపించడం లేదు.
ఈ సందర్భంగా వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయ శక్తుల పునరేకీకరణలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించే అవకాశం ఉండే సంకేతాలు వెలువడుతున్నాయి. సంస్థాగతంగా జనసేన బలమైన ప్రాతిపదికను ఏర్పర్చుకోలేకపోతున్నా, ప్రజల మద్దతు కూడా దీసుకోవడంలో మాత్రం వెనుకబడి లేదు. నేడు రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లిన అత్యంత ప్రజాకర్షణ గల నేతగా పవన్ కళ్యాణ్ గుర్తింపు పొందుతున్నారు.
గత ఏడాది ప్రారంభంలో జనసేనతో బిజెపి పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆ రెండు పార్టీలు కలసి ఇప్పటివరకు స్పష్టమైన సంకేతం ప్రజలకు ఇవ్వలేక పోతున్నాయి. ఎవ్వరి దారి వారిదిగా ఉంటున్నది. మరోవంక టిడిపి నాయకత్వం జనసేనతో పొత్తు ఉంటేగాని అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొని ప్రజలలోకి వెళ్లలేమనే ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తున్నది.
ఇటువంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ అనుసరించే రాజకీయ వ్యూహం ఏపీ రాజకీయాలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ దిశలో వచ్చే వారం జరుగనున్న పార్టీ ఆవిర్భావ సదస్సు కీలకమైన మలుపుగా మారే అవకాశం ఉంది.
రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు- జరుగుతున్నాయని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ- చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొనడం గమనార్హం. ఎన్నారై జనసైనికులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మనోహర్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రసంగం కోసం యావత్తు రాష్ట్రం ఎదురు చూస్తోందని తెలిపారు.
ఈ సభా వేదిక నుంచే భవిష్యత్తు కార్యాచరణ, పార్టీపరంగా తీసుకోవాల్సిన కొన్ని రాజకీయ నిర్ణయాలపై అధ్యక్షుడు ప్రసంగిస్తారని ఆయన వెల్లడించాయిరు. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ వంతు సాయం అందించాలని ఎన్నారై జనసైనికులకు ఆయన పిలుపునిచ్చారు.
రాజకీయ పార్టీ అంటే టీ-మ్ ఎఫెక్ట్ అని, మనందరం కలిసికట్టు-గా ఈ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఏఏ గ్రామాల్లో జనసైనికులు యాక్టివ్గా పని చేస్తున్నారో గమనించి, వారికి మీవంతు ఉడతాభక్తిగా సాయం అందిస్తే అది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు.
మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న జనసైనికులు, వీర మహిళలు కూడా క్రియాశీలక సభ్యత్వ నమోదుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. అయితే ఆవిర్భావ సభ అనంతరం ఈ విషయంలో ముందుకు వెళ్తామని వివరించారు. అందరూ గర్వపడే విధంగా తమకన్నా ఒక రోజు ముందే మీరు వ్యవస్థాపన దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమని ఎన్నారై జనసైనికులతో నాదెండ్ల మనోహర్ అభినందించారు.