ఉత్తర ప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) ఒక సీట్ కు పరిమితం కావడం, ఓట్ల శాతం కూడా గణనీయంగా పడిపోవడం రాజకీయంగా ఆమెను వ్యతిరేకించే వారికి సహితం విస్మయం కలిగిస్తున్నది. ఎన్నికల ముందు నుండీ గతంలో వలే ఆమె రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. దానితో భారత రాజకీయాలలో మాయావతి (66) శకంతో పాటు దళిత్ రాజకీయాలకు కాలం చెల్లిందా? అనే ప్రశ్న తెలత్తుతోంది.
భారత రాజకీయ అజెండాలో దళిత్ రాజకీయాలకు కీలక స్థానం ఏర్పర్చిన ఘనత బిఎస్పి వ్యవస్థాపకులు కన్షిరామ్, ఆయన వారసురాలిగా మాయావతికి దక్కుతుంది. ఉత్తర ప్రదేశ్ లో సొంతంగా పార్టీని అధికారంవైపు నడిపించి, ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం ఒక విధంగా చరిత్ర సృష్టించడమే. దేశంలో ముఖ్యమంత్రి పదవిలో దళితులు మరెవ్వరు అంత సుదీర్ఘకాలం లేరు.
అయితే ఇప్పుడు మాయావతి రాజకీయంగా అసంబద్ధం అయ్యారని, సాంప్రదాయ దళిత రాజకీయాలు అంతరించిపోయే అంచున ఉన్నాయని ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలకు హాజరై, ప్రభుత్వంలో ఉన్నత అధికారిగా చేరాలనుకున్న ఆమె కాన్షిరామ్ ప్రోత్సాహంతో పార్టీలో చేరడం, కేవలం దళితులకు పరిమితంగా ఉన్న పార్టీని సర్వజనుల పార్టీగా మార్చి, దేశంలో పెద్ద రాష్ట్రమైన యుపిలో అధికారంలో రావడం సాధారణమైన అంశం కాదు.
అయితే 2012 నుండి ఆమె ఓట్లు, సీట్లు తగ్గుతూ వస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం దళితులలో చొచ్చుకు పోవడానికి ఆర్ ఎస్ ఎస్ దశాబ్దాలుగా చేస్తున్న కృషి ప్రధాన కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా మాయావతికి వెన్నుదన్నుగా నిలిచిన జాతవ్లతో కూడిన సామాజిక పునాది ఉత్తరప్రదేశ్‌లో బిజెపి వైపు మళ్లిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
2012లో అధికారం కోల్పోయినా మాయావతి 26 శాతం ఓట్ షేర్‌ను నిలుపుకున్నారు. 2017 ఎన్నికల్లో 19 సీట్లతో 22.33 శాతం ఓట్లను కైవసం చేసుకున్నారు. కానీ ఈ సారి 10 శాతంకు పైగా ఓట్లు తగ్గాయి. కాన్షీరామ్ స్థాపించిన తొమ్మిదేళ్ల తర్వాత 1993 ఎన్నికల్లో బీఎస్పీకి 11.12 శాతం ఓట్లు వచ్చాయి. ఇది ఇప్పటివరకు అత్యల్పంగా ఉంది. ఇప్పుడు తిరిగి ఆ స్థాయికి చేరుకున్నట్లయింది.
మరోవంక, సంస్థాగత బలం లేకపోవడం, అత్యంత కేంద్రీకృత పార్టీ నిర్మాణం, అందుబాటులో లేని నాయకత్వం వంటివి ఆ పార్టీ ఓటమికి కారణాలుగా భావిస్తున్నారు. 2019 లోక్ సభ ఎన్నికలలో సమాజవాద్ పార్టీతో కలసి 10 సీట్లు గెల్చుకున్న తర్వాత, జరిగిన మూడు ఉపఎన్నికలలో సహితం ఈ పార్టీ గెలుపొందింది. అయితే ఆ వెంటనే ఆ కూటమి నుండి ఆమె ఏకపక్షంగా బైటకు రావడం ఒక విధంగా ఆమె పట్ల విశ్వసనీయతను ప్రశ్నార్ధకరం చేస్తూ వచ్చింది.
ఆ సమయంలో ఆమె సోదరుడిపై ఆదాయపన్ను దాడులు జరగడంతో, కేంద్రంలోని బిజెపి వత్తిడుల మేరకే ఆమె ఆ కూటమి నుండి విలువలకు వచ్చారనే ఆరోపణలు వచ్చాయి. బిజెపికి బి టీమ్‌గా బిఎస్పి పనిచేస్తుందనే విమర్శలు చెలరేగాయి. ఆ పార్టీలో రెండోతరం నాయకత్వం లేకపోవడం, ఆమె మాత్రమే నాయకురాలు కావడం కూడా ఆ పార్టీ ప్రభావం తగ్గడానికి కారణంగా కనిపిస్తున్నది. ఆమె మాత్రమే 18 ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్నారు.
ఆశ్చర్యకరంగా, కౌంటింగ్ రోజు ముందు, మాయావతి తన సోదరుడు ఆనంద్ కుమార్‌ను పార్టీ ఉపాధ్యక్షుడిగా, మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్తగా ప్రకటించారు. ఎన్నికల సమయంలో పార్టీ ప్రచారం, ఇతర వ్యవహారాలను ఎక్కువగా పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రాకు వదిలివేశారు. చిరకాలంగా ఆమెకు విధేయులుగా ఉన్నట్టు పలువురు పార్టీని విడిచిపెట్టి, ఎన్నికలకు ముందు ఎస్పీ లేదా బిజెపిలో చేరారు.
దళిత రాజకీయాలను పరిశీలిస్తున్న దళితుల మద్దతుతో జాతీయస్థాయి నాయకురాలిగా ఎదిగినప్పటికీ, మాయావతి దళిత వర్గాల నుండి ఉద్భవిస్తున్న ఆకాంక్షలను తీర్చడంలో విఫలమయ్యారని భావిస్తున్నారు. భీమ్ ఆర్మీ పుంజుకోవడంతో ఆమె అప్రమత్తం అయి ఉండవలసింది, కానీ ఆమె పట్టించుకోలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దళిత రాజకీయాలలో చంద్రశేఖర్ రావణ్ ఎదుగుదల దళిత యువతకు ఆకట్టుకోవడంలో మాయావతి వైఫల్యాన్ని సూచిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నది.