కేవలం వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు లాంఛనంగా ఆమోదించడం కోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి పేల్చిన బాంబుతో మంత్రులందరిలో ఆందోళన మొదలైనది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, పలువురు మంత్రులు పదవులు కోల్పోతారని స్పష్టం చేశారు. అయితే వారికి పార్టీ పనులు అప్పజెబుతామని, ఆ పెదవులని గౌరవంగా భావించాలని హితవు చెప్పారు.
వాస్తవానికి మంత్రివర్గం ప్రమాణస్వీకారం సమయంలోనే రెండున్నరేళ్ల తర్వాత సంగం మంది మంత్రులను వారి పనితీరు ఆధారంగా మారుస్తానని చెప్పారు. ఆ తర్వాత మంత్రులందరినీ మార్చబోతున్నట్లు సంకేతం ఇచ్చారు.
ఏ కారణం వాళ్లయితేనేమి డిసెంబర్ లో జరుగవలసిన మంత్రివర్గ మార్పులు జరగలేదు. ఆ విషయాన్ని మంత్రులు మరచిపోతున్న సమయంలో ముఖ్యమంత్రి స్వయంగా మంత్రివర్గ సమావేశంలోనే ప్రస్తావించి, త్వరలోనే మీలో చాలామంది పదవులు పోవడం ఖండం అంటూ చెప్పడం కలకలం రేపింది.
అయితే వెంటనే ఉండకపోవచ్చని, జూన్ లో ఉండవచ్చనే సంకేతం ఇప్పుడు ఇస్తున్నారు. ఎప్పుడు జరిపినా జగన్ ఆ కసరత్తు చేపట్టారన్నది స్పష్టం. దానితో మంత్రిపదవులు ఎవ్వరికీ ఉంటాయి, ఎవ్వరికీ పోతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఎన్నికల ప్రచారం సమయంలో పలువురు అభ్యర్థులను గెలిస్తే మంత్రులుగా చేస్తానని స్వయంగా జగన్ ప్రకటించారు.
మరికొందరికి కొన్ని కారణాల వల్లన సీట్లు ఇవ్వలేక పోతున్నారని, ఎమ్యెల్సీలుగా చేసి, మంత్రిపదవులు ఇస్తానని చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా వారిలో చాలామందికి మంత్రి పదవులు ఇవ్వక పోగా, కనీసం ఎమ్యెల్సీ పదవులు కూడా ఇవ్వలేదు. మంత్రువర్గం మార్పులో అయినా ఇస్తారా అన్నది అస్పష్టంగానే ఉన్నది.
అటువంటి వారిలో ఆర్ కె రోజా, మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, చికాలాలూరిపేట మాజీ ఎమ్యెల్యే రాజశేఖర్ వంటి వారున్నారు. రెండేళ్ల క్రితం రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఇద్దరు మంత్రులను రాజ్యసభ సభ్యులుగా చేయడంతో, వారు మంత్రి పదవులు కోల్పోయారు. వారు – సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి రమణారావు. రెండు నెలలో మళ్ళి రాజ్యసభ ఎన్నికలు రానున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సభ్యరాణాయనను రాజ్యసభకు పంపవచ్చనే ఊహాగానాలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి ఆలోచనలు ఏవిధంగా ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు.
టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎప్పటి నుండో రాజ్యసభ సీట్ గాని లేదా ఎమ్యెల్సీగా మంత్రివర్గంలో చేరడం గాని కోరుకొంటున్నారు. అయితే ఆయన కోర్కె నెరేవేరే సూచనలు కనిపించడం లేదు. గత ఎన్నికలలో లోక్ సభ సీట్ ఇవ్వకపోవడంతో రాజ్యసభకు పంపుతానని స్వయంగా జగన్ చెప్పడం గమనార్హం.
ఇక కీలక మంత్రులైన డా. రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాజ్యసభకు వెళ్లకపోతే బొత్స సత్యనారాయణ వంటి వారి పదవులకు ఢోకా ఉండదనే ప్రచారం జరుగుతున్నది. ఇటీవలనే మంత్రి గౌతమ్ రెడ్డి మృతిచేయండంతో మంత్రివర్గంలో ఒక స్థానం ఇప్పటికే ఖాళీగా ఉంది.
ప్రకాశం జిల్లా మంత్రి, జగన్ సమీప బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి తప్ప బహిరంగంగా మరెవ్వరు మార్పులకు మంత్రిపదవులు వదులుకోవడానికి బహిరంగంగా సంసిద్ధతను వ్యక్తం చేయక పోవడం గమనార్హం.
మంత్రి పదవులు కోల్పోయేవారిని ఒకొక్క జిల్లా పార్టీ ఇన్ ఛార్జ్ గానో, పార్టీ అధ్యక్షునిగానో చేస్తానని జగన్ చెబుతున్నా పార్టీ పదవుల పట్ల ఎవ్వరు ఆసక్తి కనబరచడం లేదు. ఎందుకంటె పార్టీ వ్యవస్థ పట్ల జగన్ ముఖ్యమంత్రి చేపట్టినప్పటి నుండి ఎటువంటి ఆసక్తి కనబరచడం లేదు.