ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం తీవ్రంగా ఖండించారు. చిన్న పిల్లల ఆసుపత్రులు, సామాన్య ప్రజలపై బాంబులు కురిపించడం ఆటవిక, పైశాచిక చర్య అని తెలిపారు. ఆమోదయోగ్యం కానటువంటి ఈ నరమేధాన్ని దేవుని కోసం ఆపాలని కోరారు.
చర్చలపై నిజమైన, నిర్ణయాత్మకమైన దృష్టి పెట్టాలని కోరారు. మానవతావాద నడవ (కారిడార్)లను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం కల్పించాలని ఆయన కోరారు. బాలలను, నిరాయుధులను చంపడం ఆటవిక చర్య అని పేర్కొన్నారు.
రోమ్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో సండే బ్లెస్సింగ్ సందర్భంగా వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ పిలుపిచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24 నుంచి కొనసాగుతోంది. ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది ప్రజలు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్ళిపోతున్నారు.
న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ దుర్మరణం
ఉక్రెయిన్‌లోని ఇర్పెన్లో రష్యా బలగాలు జరిపిన దాడుల్లో న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ బ్రెంట్ రెనాడ్ దుర్మరణం పాలయ్యారు. మరో జర్నలిస్ట్ గాయపడ్డారని కీవ్ పోలీస్ చీఫ్ ఆండ్రివ్ నెబిటోవ్ తెలిపారు.
బ్రెంట్ రెనాడ్ వయసు 51 సంవత్సరాలు. ఆయన మృతదేహాన్ని ఘటనా స్థలం నుంచి తరలించేందుకుు యత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
మరోవైపు ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రారంభమై 17 రోజులైంది. వందలాది మంది చనిపోయారు. రెండు కోట్ల మంది విదేశాలకు వలసపోయారు.
కాగా, లివివ్లోని ఉక్రెయినియన్ మిలిటరీ బేస్‌పై రష్యా దాడిలో కనీసం 35 మంది ప్రాణాలు కోల్పోయారు, సుమారు 134 మంది గాయపడ్డారు. ఈ సైనిక స్థావరం 360 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనిపై దాదాపు 30 రాకెట్లను రష్యా దళాలు ప్రయోగించినట్లు తెలుస్తోంది.
వీటిలో కొన్నిటిని మధ్యలోనే ఉక్రెయిన్ దళాలు అడ్డుకోగలిగినట్లు సమాచారం. ఉక్రెయిన్‌లోని వివిధ నగరాల్లో వందలాది మంది సామాన్య ప్రజలు, అదేవిధంగా రష్యన్ సైనికులు మరణిస్తున్న సంగతి తెలిసిందే.