ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మొట్టమొదటగా ఓ మహిళను ఎంపిక చేసేందుకు బిజెపి కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా రీతూ ఖండూరి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. దీంతో కోట్ద్వార్ నియోజకవర్గం నుండి విజయం సాధించిన రీతూ ఖండూరికి ఆ అవకాశం దక్కనున్నట్లు సమాచారం.
బిజెపి మహిళా కార్యకర్తలు కూడా రీతూకి భారీగా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఓటమిపలయ్యారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ సందర్భంగా తదుపరి సిఎంగా ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బిసి ఖండూరీ కుమార్తె రీతూ ఖండూరీ పేరు బలంగా వినిపిస్తోంది. పైగా, రీతూ ఖండూరీ భర్త కూడా కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహతుడు కావడంతో ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నట్లు పలు వర్గాలు భావిస్తున్నాయి.
ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చించేందుకు ఢిల్లీ రావాలంటూ పార్టీ అధిష్టానం నుండి పిలుపు రావడం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. అలాగే పుష్కర్ సింగ్ ధామి, సుబోధ్ ఉనియాల్లకు కూడా ఢిల్లీ నుండి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. రీతూ ఖండూరీతోపాటు మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, కేంద్ర మాజీమంత్రి రమేశ్ పోఖ్రియాల్, రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి.