గత 19 రోజులుగా భీకర యుద్ధం సాగుతూన్నా ఆర్కైన్ లొంగుబాటు ధోరణి ప్రదర్శించక పోవడం పట్ల రష్యా అసహనంగా ఉన్నట్లు తెలుస్తున్నది. సరిహద్దులు దాటుకుని ఉక్రెయిన్ నగరాలను వరుసగా ఆక్రమించుకుంటూ దూసుకెళ్తున్న రష్యా సేనలకు రాజధాని కీవ్ లో మాత్రం ఉక్రెయిన్ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.
తమ రాజధాని నగరాన్ని కాపాడుకునేందుకు సామాన్య పౌరులు సైతం ఆయుధాలు చేతబట్టి పోరాడుతుండటం రష్యాకు విస్మయం కలిగిస్తున్నది. ఎంతగా శ్రమిస్తున్నా కీవ్ ను రష్యా తమ చేతిలోకి తెచ్చుకోలేకపోతోంది. అమెరికా, నాటో దేశాల నుంచి మిస్సైల్స్, ఇతర ఆయుధాలు అందుతుండడంతో వెనక్కి తగ్గేదే లేదంటే ఉక్రెయిన్ పోరాటం సాగిస్తోంది.
ఈ క్రమంలో రష్యా కూడా ఆయుధ సాయం కోసం ప్రయత్నిస్తోందని అమెరికా అధికారి ఒకరు చెబుతున్నారు. చైనా నుంచి సైనిక పరికరాలను సాయంగా కోరినట్లు తెలిపారు. రష్యా యుద్ధం, ఆ దేశంపై ఆర్థిక ఆంక్షల ద్వారా ఒత్తిడి లాంటి అంశాలపై ఇవాళ రోమ్ లో అమెరికా, చైనా ప్రభుత్వ ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో రష్యా ఆయుధ సాయం కోరినట్లు వార్తల రావడం మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నది.
రోమ్ వేదికగా చైనా విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి యాంగ్ జీచీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో సులివాన్ మాట్లాడుతూ.. రష్యా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను చైనాతో సహా మరే దేశం కూడా భర్తీ చేయలేవని వెల్లడించారు.
యుద్దం కారణంగా రష్యా తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొనుందని తెలిపారు. మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ క్రమంలో ఫ్రాన్స్.. ఉక్రెయిన్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు మద్దతుగా ఉండాలని వారు నిర్ణయించినట్టు సమాచారం.
రష్యాకు చైనా తమ ఆయుధ సాయం చేయకున్నా ఆర్థికంగా అండగా నిలిచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఓ అధికారి చెప్పినట్లుగా ప్రస్తావిస్తూ దీనికి సంబంధించిన వార్తలు ఫైనాన్షియల్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికల్లో వచ్చాయి.
ఇలా ఉండగా, పిల్లల్ని కూడా రష్యన్ సైనికులు కాలుస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. అయితే పుతిన్ దళాలు కీవ్‌ను పూర్తిగా నేలమట్టం చేసిన తర్వాతే.. ఆ నగరం వారికి దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఈ రీజియన్ చరిత్రను, కీవన్ రస్ చరిత్రను, ఐరోపా చరిత్రను చెరిపేయాలనుకుంటే, మమ్మల్ని అందరినీ నాశనం చేయాలని అనుకుంటే.. వారు కీవ్‌లోకి రాగలరు. అదే వారి లక్ష్యం అయితే.. వాళ్లను రానివ్వండి. కాకపోతే.. వాళ్లు మాత్రమే ఇక్కడ జీవిస్తరు” అని ఆవేదన వ్యక్తం చేశారు.