కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుండి నరేంద్ర మోదీ ప్రభుత్వంకు భారీ మొత్తంలో డివిడెండ్లు అందుతున్నాయి. వరుసగా రెండో ఏడాది కూడా సవరించిన అంచనాలను మించిపోయాయి. ఆర్థిక కార్యాకలాపాలు పుంజుకోవడం, పెరుగుతున్న వస్తువుల ధరలు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థలు లాభాన్ని చవిచూసేలా చేశాయి.
పెట్టుబడులు, ప్రజా ఆస్తుల మేనేజ్మెంట్ విభాగం (డిఐపిఎఎం) డేటా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఈ నెల మార్చి 13 నాటికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సిపిఎస్ఇలు) కేంద్రానికి రూ.49,059 కోట్లును డివిడెండ్ల రూపంలో చెల్లించాయి. ఈ డివిడెండ్ ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ సవరించిన అంచనా రూ. 46 వేల కోట్ల కన్నా ఎక్కువ.
కరోనాకు ముందు 2019-20 సంవత్సరానికి గానూ తీసుకున్న డివిడెండ్లు రూ. 35,543 కోట్ల కన్నా ఈ ఏడాది ఇప్పటివరకు అందుకున్న డివిడెండ్లు 38 శాతం ఎక్కువ. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కూడా కేంద్రం రూ. 39,022 కోట్లను.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుండి పొందింది. కాగా, అప్పటి సవరించిన అంచనాలు రూ. 34,717 కోట్లు. ఈ లెక్క ప్రకారం గత ఏడాది కూడా అంచనా వేసిన దాని కన్నా అదనంగా డివిడెండ్లు మోడీ సర్కార్‌కు చేరాయి.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుండి అందే డివిడెంట్లను ఎప్పటికప్పుడే డిఐపిఎఎం ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తోంది. ఈ డేటా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒఎన్‌జిసి నుండి రూ. 5,586 కోట్లు డివిడెండ్ల రూపంలో కేంద్రానికి అందగా కోల్ ఇండియా రూ. 5,094 కోట్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రూ. 4,475 కోట్లు, ఇండియన్ ఆయిల్ రూ. 4,363, ఎన్టిపిసి రూ.3,542 కోట్లు, గెయిల్ 1,827 కోట్లు చెల్లించారు.
సెయిల్ రూ. 1,557 కోట్లు చెల్లించాయి. భారతీయ పెట్రోలియం నుండి మోడీ సర్కార్‌కు రూ.1,150 కోట్లు ఇచ్చింది. కాగా, ఈ సంస్థ 2021 అక్టోబర్‌లో చివరి డివిడెండ్‌గా రూ.6,665 కోట్లు చెల్లించింది. కాగా, దీన్ని త్వరలో మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతోంది.
మరో వైపు క్రూడ్, గ్యాస్, ఇతర వస్తువుల ధరల పెరుగుదలతో, చమురు సంస్థలు, మెటల్స్, మైనింగ్ రంగాల్లోని ప్రభుత్వ సంస్థలు.. లాభాలు చవిచూశాయి. దీంతో ఈ రంగాల నుండి కూడా కేంద్రానికి భారీగా డివిడెండ్ల చెల్లింపులు జరిగే అవకాశాలున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన రూ.50,028 డివిడెండ్ల కన్నా అధిగమించవచ్చు.
కాగా, 2022-23 బడ్జెట్లో.. కేంద్రం అంచనా వేసిన డివిడెంట్ రూ. 40 వేల కోట్లుగా ఉంది. కరోనా సమయంలో కూడా కేంద్రానికి డివిడెండ్ల రూపంలో భారీ లాభాలను చెల్లించిన ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రం మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు సిద్ధపడటం గమనార్హం.