మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యవెనుక ‘రాజకీయ పెద్దల’ హస్తం ఉందని సీబీఐ ఆరోపించింది. హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, అతని అనుచరులు సాక్షులను బెదిరిస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది ఎ.చెన్నకేశవులు హైకోర్టులో వాదనలు వినిపించారు.
సీఆర్పీసీ 164 కింద మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు దర్యాప్తు అధికారి ముందు అంగీకరించిన సీఐ శంకరయ్య, గంగాధర్‌రెడ్డి, కృష్ణారెడ్డి తరువాత విరమించుకున్నారని తెలిపారు. వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించిన తరువాతే సస్పెన్షన్‌లో ఉన్న సీఐ శంకరయ్యకు పోస్టింగ్ ఇచ్చారని పేర్కొన్నారు.
సాక్ష్యం చెప్పేందుకు ముందుకొస్తున్నవారిని బెదిరించడంతో పాటు ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలిపారు. నిందితుల నుంచి తనకు ప్రాణహాని ఉందని అప్రూవర్‌గా మారిన దస్తగిరి మేజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. గంగిరెడ్డి మినహా ఇతర నిందితులు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారని కోర్టుకు తెలిపారు.
నిందితుడి నుంచి సాక్షులకు ప్రాణహాని ఉందని చెబుతూ దర్యాప్తునకు విఘాఫూతం కలుగుతుందని చెప్పారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి గంగిరెడ్డి బెయిల్ రద్దు కోసం ట్రయల్ కోర్టులో ఎప్పుడు పిటిషన్ దాఖలు చేశారు? తదితర వివరాలను కోర్టు ముందు ఉంచాలని సీబీఐని ఆదేశించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ సోమవారం ఆదేశాలిచ్చారు. ఎర్ర గంగిరెడ్డికి జూన్ 2019లో మంజూరు చేసిన డీఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది.
వివేకా హత్య కేసులో మూడో నిందితుడిగా ఉన్న గజ్జల ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం నాల్గవ అదనపు జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ తరుపు న్యాయవాది ఉమాశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని దీనిని కోర్టు పరిగణించాలని అభ్యర్థించారు.
సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వివేకా హత్య కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వరాదని కోర్టును అభ్యర్థించారు. వాదనలను విన్న జడ్జి శ్రీనివాస్ శివరామ్ విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. కాగా.. వివేకా హత్య కేసులో కీలక సమాచారం అందించిన వాచ్‌మన్ రంగన్న, షేక్ దస్తగిరిలకు తగిన భద్రత కల్పించాలని జిల్లా సెషన్స్ కోర్టులో సీబీఐ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తంకుమార్ సోమవారం విచారణకు స్వీకరించారు.