తమిళనాడులో బలం పుంజుకోవాలని చేస్తున్న రకరకాల ప్రయోగాలు బెడిసి కొడుతూ ఉండడంతో తాజాగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి జయలలితను దగ్గరకు తీస్తున్నట్లు తెలుస్తున్నది. ఆమెకు అన్నాడీఎంకేను హస్తగతం చేసుకునేందుకు సహకరించడం ద్వారా రాజకీయంగా చైతన్యవంతమైన ఈ దక్షిణాది రాష్ట్రంపై పట్టు పెంచుకోవాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.
తనపై ఉన్న బహిష్కరణకు తొలగించి, తిరిగి తనను పార్టీలో చేర్చుకోవాలని ఆమె ఎంతగా వత్తిడి తెస్తున్నా ఆ పార్టీలో ఈపీఎస్ వర్గం అన్నివిధాలా అడ్డుకొంటున్నది. దానితో అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వంకు, ఈపీఎస్ ల మధ్య అగాధం పెంచి, తనను ఆహ్వానించకుండా తప్పని పరిస్థితులు ఏర్పడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా పన్నీర్‌సెల్వం సోదరుడు రాజా ఆమెను రెండు సార్లు కలుసుకొని పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు.
వాస్తవానికి జయలలిత మృతి చెందిన వేంటనే ఆ పార్టీని హస్తగతం చేసుకొనే ప్రయత్నం బిజెపి చేసింది. ముఖ్యమంత్రి పదవి కోసం ఆ పార్టీ రెండుగా చీలిన సమయంలో, బిజెపి మద్దతుతోనే ఈపీఎస్ నిలదొక్కుకోవడం, ఆ రెండు వర్గాల మధ్య బిజెపినే సయోధ్య కుదర్చడం జరిగింది. జైలు శిక్ష పూర్తిచేసుకొని రాగానే పార్టీలోకి రావాలని శశికళ గత ఎన్నికల ముందు చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో మూడో కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
అయితే, ఆమె ఆ విధంగా చేస్తే డీఎంకే గెలుపు ఖాయం అవుతుందనే భయంతో బిజెపి కేంద్ర నాయకత్వం ఆమెను పార్టీలో చేర్చుకోమని ఎంత వత్తిడి చేసినా ముఖ్యమంత్రి పళనిస్వామితో పాటు పన్నీరుసెల్వం కూడా ఒప్పుకోలేదు. దానితో ఎన్నికలు పూర్తయ్యేవరకు మౌనంగా ఉండమని ఆమెను బెదిరించారు. లేని పక్షంలో కేంద్రం ఏజెన్సీల ముప్పు ఉండగలదని కూడా చెప్పిన్నట్లు తెలుస్తున్నది.
ఇక ఎన్నికలలో అన్నాడీఎంకే ఓడిపోవడంతో పార్టీపై ఆధిపత్యంకు ఇదే తరుణం అని ఆమె భావించారు. ఇటీవల ఆధ్యాత్మిక పర్యటన పేరుతో శశికళ మూడు రోజుల పాటు జరిపిన దక్షిణాది జిల్లాల పర్యటనలో అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘనస్వాగతం పలకటం ఆమెలో ఉత్సాహాన్ని నింపింది. అన్నాడీఎంకే శ్రేణులంతా తన వెంటే ఉన్నారంటూ ఆ పర్యటనలో పలుచోట్ల ఆమె పదే పదే ప్రకటించారు.
పన్నీర్‌సెల్వం గతంలో శశికళను పార్టీలో చేర్చుకునే విషయాన్ని పార్టీ నాయకుల సమావేశంలో ప్రస్తావించి అభాసుపాలయ్యారు. ఎడప్పాడి వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయన తన మనస్సు మార్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో శశికళ ఎలాగైనా అన్నాడీఎంకేలో చేరాలని తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ విషయమై ఆమె బీజేపీ జాతీయ నాయకులు కొందరితో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. తనను అన్నాడీఎంకేలో చేర్చుకునేలా ఆ పార్టీ నేతలు ఎడప్పాడి, పన్నీర్‌సెల్వంకు నచ్చచెప్పాలంటూ విన్నవించినట్లు తెలిసింది.
‘‘జైలు నుంచి రాగానే మీరు చెప్పినట్లే నేను పక్కకు తప్పుకున్నాను. ఓట్లు చీలే అవకాశమున్నందున పార్టీకి దూరంగా ఉండాలంటూ మీరు చెప్పడం వల్లే నేను దూరంగా ఉండిపోయాను. కానీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాది కావస్తున్నా.. నేను పార్టీలోకి చేరే మార్గం కనిపించడం లేదు. ఇక నా బాధ్యత మీదే’’ అంటూ శశికళ బీజేపీ అగ్రనేతలకు సందేశం పంపినట్లు చెబుతున్నారు.
మరోవంక, శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారాన్ని కోల్పోవటానికి, ఇటీవల జరిగిన మున్సిప్ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవటానికి ఆ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడమే ప్రధాన కారణమని బీజేపీ నాయకులకు ఆమె వివరించారు. భవిష్యత్‌లో అన్నాడీఎంకే, బీజేపీల మధ్య బలమైన కూటమి ఏర్పడానికి తాను సహాయ సహకారాలు అందిస్తానని, ఈ అంశాన్ని గుర్తుంచుకుని తనను ఎలాగైనా అన్నాడీఎంకే పార్టీలో చేర్చుకునేలా చూడాలని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం.
బీజేపీ జాతీయ నాయకులతో శశికళ రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలియడంతో ఆమెను పార్టీలో చేరకుండా ఉండేందుకు అన్నాడీఎంకే నేతలు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ మేరకు వీలైనంత త్వరగా పార్టీ సంస్థాగత ఎన్నికలను ముగించి సర్వసభ్య మండలి సమావేశం జరపాలని నిర్ణయించారు.
అదే సమయంలో ఈ నెల 20న శశికళ జరుపనున్న తంజావూరు, సేలం జిల్లాల పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు పాల్గొనకుండా కట్టుదిట్టం చేస్తున్నారు. శశికళ పర్యటనలో పాల్గొనే పార్టీ నాయకులు, కార్యకర్తలను పార్టీ నుంచి బహిష్కరిస్తామని కూడా హెచ్చరించారు. ఈ నెల 20న శశికళ భర్త నటరాజన్ వర్థంతి కార్యక్రమాలు తంజావూరు జిల్లా విలార్కుళంలో జరుగనున్నాయి.
ఆ కార్యక్రమంలో పాల్గొనేలా శశికళ తంజావూరు, సేలం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పరిస్థితుల్లోనే అన్నాడీఎంకే నేతలు ఎడప్పాడి. పన్నీర్‌సెల్వం పార్టీలో అడుగుపెట్టనీయకుండా సర్వసభ్య మండలిలో ప్రత్యేక తీర్మానం చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా శాఖ నాయకులకు అన్నాడీఎంకే నేతలిరువురూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఏపిల్ర్ నెలాఖరులోగా పార్టీ కార్యనిర్వాహక మండలి, సర్వసభ్య మండలి సమావేశాలను జరిపి శశికళకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని ఎడప్పాడి పన్నీర్‌సెల్వం నిర్ణయించారు.
పలు ఆర్ధిక అక్రమ కేసులు ఎదుర్కొంటున్న శశికళ అయితే తాము చెప్పిన్నట్లు వినవలసిందే అని, పైగా ఆమెకు అపారమైన వనరులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పట్టు ఉండడంతో తమిళనాడులో బలం పుంజుకోవడానికి సహాయకారి కాగలదని బిజెపి జాతీయ నాయకత్వం విశ్వసిస్తున్నది. ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్లు ఉత్తరాది రాష్ట్రాలలో తగ్గే అవకాశం ఉన్నందున వాటిని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడులో భర్తీ చేసుకోవడం కోసం స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భారీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది.