అత్యంత వేగంగా నడిచే బులెట్ రైళ్ల కోసం తెలుగు రాష్ట్రాల నుండి కేంద్రంపై డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా విజయవాడ – హైదరాబాద్ మధ్య బులెట్ రైలు నడపాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి పార్లమెంట్ లో కోరారు. ఈ రెండు ప్రధాన నగరాలను బుల్లెట్ ట్రైన్ ద్వారా కలపడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
దీంతో పాటు హైదరాబాద్ నుంచి బెంగళూరు, ముంబయి వంటి మెట్రో నగరాలను కలుపుతూ.. బుల్లెట్ ట్రైన్స్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీ అయిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచాలన్న ప్రతిపాదన ఇంకా నెరవేరలేదని గుర్తు చేసారు. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, విజయవాడ,. ముంబయి ప్రాంతాలు హైదరాబాద్‌తో కనెక్ట్ చేసే విధంగా బుల్లెట్ రైలు లేదా హైస్పీడ్ ట్రైన్ సదుపాయాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఎనిమదేళ్ల క్రితం 2014లో చేసిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం’లో ఇచ్చిన హామీ మేరకు ఖాజీపేటలో రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. గతంలో పలుమార్లు లోక్‌సభలో ఈ అంశం గురించి ప్రస్తావించానని పేర్కొన్నారు. ప్రధానమంత్రి, రైల్వే మంత్రిని కూడా కలిసి విజ్ఞప్తి చేశానని తెలిపారు. చట్టపరమైన ఆ హామీకి ప్రాధాన్యత, అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు.
అయితే, ప్రస్తుతం దేశంలో రైల్వే కోచ్‌లు తయారు చేసే అవసరాలను పరిగణనలోనికి తీసుకుంటే, ఖాజీపేటలో ఏర్పాటు చేయాల్సిన రైల్వే కోచ్ కర్మాగారం అంత లాభదాయకం కాదని గతంలో రైల్వే మంత్రి తెలిపారని పేర్కొన్నారు. విభజన చట్టంలో రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటుకు హామీ ఇచ్చిన ఉద్దేశం ప్రధానంగా తెలంగాణలో అదనంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమేనని స్పష్టం చేశారు.
నూతనంగా 400 వందే భారత్ అధునాతన న్యూజనరేషన్ రైళ్లను ప్రవేశ పెట్టబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో వందేభారత్ రైలు కోచ్‌లను తయారు చేయడానికి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఖాజీపేటలో వందే భారత్ రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటు చేయడం సముచితమని ఆయన సూచించారు.
ప్రభుత్వానికి అంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టం లేకపోతే.. ప్రయివేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో (పిపిపి) రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు చాలా మంది పారిశ్రామిక వేత్తలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు, సాధ్యమైనంత త్వరగా ఖాజీపేటలో రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటు చేయాలని మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.
అదే చట్టంలో హైదరాబాద్, విజయవాడల మధ్య రైల్వే, రోడ్డు మార్గాలను మరింతగా అభివృద్ధి చేస్తామనే హామీ కూడా ఉందని ఉత్తమకుమార్ రెడ్డి గుర్తు చేశారు. సూర్యాపేట, కోదాడల గుండా హైదరాబాద్‌విజయవాడకు హైస్పీడ్ రైలుగానీ, బుల్లెట్ రైలుగానీ వేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. అహ్మదాబాద్- ముంబై మధ్య ఏర్పాటు చేస్తున్న బుల్లెట్ రైలు కంటే హైదరాబాద్-విజయవాడకు బుల్లెట్ రైలు ఆర్థికంగా లాబదాయకంగా ఉంటుందని తెలిపారు.
తెలంగాణలో చిట్యాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట వరకు కొత్త రైల్వే లైను వేయడంతో పాటు, ఆ మార్గంలో హైస్పీడు రైళ్లు నడిపించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండు గంటల్లోనే ప్రయాణం చేయవచ్చని సూచించారు. ప్రస్తుతం ఉన్న మోటుమర్రిమేళ్ల చెరువు- మఠంపల్లి, జానపాడు- విష్ణుపురం రైల్వేలైనులో గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు.
ఈ మార్గంలో ప్యాసింజర్ రైళ్లను కూడా నడపాలని రైల్వే మంత్రికి గతంలో పలుమార్లు విజ్ఞప్తి చేశానాని తెలిపారు. అయితే, ప్యాసింజర్ రైళ్లను ఈ మార్గంలో నడిపేందుకు ‘కమిషనర్ ఆఫ్ రైల్వే స్టాఫ్’ అనుమతించలేదని సమాధానం ఇచ్చారు. మేళ్ల చెరువు నుంచి మిర్యాలగూడెం, నల్గొండ గుండా హైదరాబాద్ వరకు ‘షటిల్ రైలు’ను వేయాలని కోరారు.