కేసీఆర్ ఏ పధకం ప్రవేశ పెట్టినా అది ఎన్నికల కోసమే అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉప ఎన్నికల కోసం దళితబంధు పెట్టి, కొందరికే సాయంచేసే చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. దళితుందరికీ దళితబంధు ఇస్తామని మాయమాటలు చెప్పి మోసం చేశారని ఆమె మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని షర్మిల పిలుపునిచ్చారు.
ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, మళ్లీ రాజన్న సంక్షేమ పాలన తీసుకువస్తామని, అప్పుడు చేనేతతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని వంకమామిడి, దంతూర్, కనుముకుల, భీమనపల్లి మీదుగా భూదాన్‌పోచంపల్లి వరకు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగింది.
ఈ సందర్భంగా భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించిన చేనేత సదస్సులో షర్మిల మాట్లాడుతూ నేటి పాలకుల విధానాలతో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మళ్లీ నమ్మితే మన బతుకులు బుగ్గిపాలు కావడం ఖాయమని షర్మిల హెచ్చరించారు.
అన్నీ వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఎంతోమంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేదని దుయ్యబట్టారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేనేత కార్మికులకు రుణమాఫీ చేశారని, నూలుపై సబ్సిడీ, నేతన్నలకు బీమా అందించారని ఆమె గుర్తు చేశారు.
నేడు నూలు ధరలు పెరిగి, గిట్టుబాటు లేక అప్పుల బాధతో 50 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారిని అధికార పార్టీ నాయకులు కనీసం పరామర్శించలేదని, ఎక్స్‌గ్రేషియా చెల్లించిన పాపాన పోలేదని షర్మిల విమర్శించారు. సీఎం కేసీఆర్ రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణను అప్పులు, ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారని ఆమె దుయ్యబట్టారు.
తెలంగాణలో ఏ ఒక్క వర్గాన్ని కూడా ఆదుకోని సీఎం కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని ఏలబోతాడంటా అని ఆమె ఎద్దేవా చేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రాగానే చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని, సబ్సిడీ రుణాలు, మగ్గానికి ఉచిత కరెంట్, సబ్సిడీపై నూలు, రంగులు అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, ప్రోగ్రాం కోర్డినేటర్ రాజగోపాల్, రాష్ట్ర ప్రచార కన్వీనర్ నీలం రమేశ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.