నేడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న, సుప్రీం కోర్ట్ నియమించిన నిపుణుల బృందం దర్యాప్తు చేస్తున్న ఇజ్రాయెల్ కు చెందిన పెగసస్ స్పైవేర్‌ను ఏపీలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టిడిపి ప్రభుత్వం కొనుగోలు చేసిన్నట్లు టిఎంసి అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణ చేశారు.
ఈ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అందిస్తామంటూ అప్పట్లో బెంగాల్‌లోని తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయని, అయితే, ఈ అంశం ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించినది, చట్ట విరుద్ధమైంది అయినందున తాము కొనలేదని ఆమె వెల్లడించారు.
‘ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో సంస్థ పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అమ్ముతామంటూ నాలుగైదేళ్ల క్రితం మా రాష్ట్ర పోలీసులను సంప్రదించింది. విషయం నాకు తెలిసి, మాకు ఆ సాఫ్ట్వేర్ అవసరం లేదని చెప్పాను’ అని ఆమె వెల్లడించారు.
కానీ ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసిన కేంద్రం ప్రభుత్వం, దానిని దేశ భద్రత కోసం ఉపయోగించడానికి బదులుగా రాజకీయ ప్రయోజనాల కోసం జడ్జీలు, ప్రతిపక్ష నేతలు, ఇతర అధికారులపై నిఘాకు వాడుకుందని ఆమె ఆరోపించారు. 2017లో పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను భారత ప్రభుత్వం 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందంటూ న్యూయార్క్‌టైమ్స్‌లో వచ్చిన కథనం ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే.
భారత్‌లో అత్యంత ప్రముఖులు, సంస్థలకు చెందిన ఫోన్లు దాదాపు 300 వరకూ ఈ ఇజ్రాయెల్ స్పైవేర్‌తో ట్యాపింగ్ అయ్యాయని 2019లో ది వైర్ పత్రిక సంచలన వార్తను వెలువరించింది. వేగు సమాచారం రాబట్టుకునేందుకు ప్రభుత్వాలకు ఈ స్పైవేర్‌ను కట్టబెడుతున్నారు. ఈ క్రమంలో భారత్‌లో దీని వాడకపు వ్యవహారం ఇప్పుడు గందరగోళానికి దారితీసింది.