చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో కృష్ణానదికి వరద పోటెత్తడంతో నదీతీర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రకాశం బ్యారేజీకి 11.4లక్షల క్యూసెక్కులకుపైగా వరద రావడంతో లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. బెజవాడ గజగజ లాడుతూనే ఉంది. కృష్ణమ్మ ఉగ్రరూపం, బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబేలెత్తింది.
భారీ వర్షాలు, వరదలతో రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కాస్త శాంతించింది. గత రాత్రి నుంచి ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. 11 లక్షల 40 వేల నుంచి గంట గంటకు తగ్గుతూ వరద తాకిడి తగ్గుముఖం పడుతోంది. ఈరోజు (మంగళవారం) ఉదయం 8 లక్షల 94 వేలకు వరద చేరుకుంది. కృష్ణమ్మ శాంతించడంతో బ్యారేజి దిగువన ఉన్న గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
మరోవైపు గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పలు గ్రామాలను వరద ముంపు వెంటాడుతోంది.
ఇప్పటికే జలావాసాలుగా మారిన నగరం, ఇంకా తేరుకోలేదు. అనేక కాలనీలు నీటిలోనే నానుతున్నాయి. జనం కట్టుబట్టలతో మిగిలారు. ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా, వరద ఉద్ధృతికి చివరి ప్రాంతాలకు వెళ్లలేకపోయింది. ఫలితంగా ప్రజలు సాయం కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు.
48 గంటలుగా మహోగ్రరూపం దాల్చిన బుడమేరు కాస్త శాంతించింది. దీంతో బుడమేరులో గండి పడిన ప్రాంతాన్ని పూడ్చేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం మూడు చోట్ల గండ్లు పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో యుద్ధ ప్రతిపాదికన పనులను చేపట్టారు. రానున్న మూడు రోజుల పాటు పనులు కొనసాగే అవకాశం ఉంది. బుడమేరుకు వరద ప్రవాహం తగ్గిపోవడంతో ఇరిగేషన్ అధికారులు పనులు ప్రారంభించారు.
కాగా.. భారీ వర్షాల కారణంగా బుడమేరు డిజైన్ కెపాసిటీ 15 వేల క్యూసెక్కులకు మించి వరద నీరు వచ్చి చేరింది. బుడమేరుకు భారీగా వరద వచ్చి చేరడంతో విజయవాడలోని 16 డివిజన్లు ముంపునకు గురయ్యాయి. దాదాపు రెండు రోజులుగా సుమారు 2 .59 లక్షల మంది ప్రజానీకం జలదిగ్భంధంలో ఉండిపోయారు. బుడమేరులో ప్రస్తుతం 6 వేల క్యూసెక్కులు మాత్రమే వరద ప్రవాహం ఉంది. ఇది మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
వరద బాధితులకు 100 శాతం ఆహారం పంపిణీ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోలేనిచోటకు హెలికాఫ్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం అందించాలని సూచించారు. వరద సహాయక చర్యలు, ఉదయం నుంచి జరిగిన ఆహారం పంపిణీపై విధుల్లో ఉన్న అధికారులు, ఉన్నతాధికారుతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు.
5 హెలీకాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ జరుగుతుందని అధికారులు తెలిపారు. 5 లక్షల ఆహారం, నీళ్ల ప్యాకెట్లు అందిస్తున్నట్లు వివరించారు. క్షేత్ర స్థాయిలో ఆహారం అందిందీ లేనిదీ అధికారులు నిర్థారించుకోవాలని అన్నారు. రెండ్రోజులు వరదలో చిక్కుకుని ఆహారం, నీరు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకుని అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు.
మన కుటుంబమే అలాంటి కష్టంలో ఉందనే ఆలోచనతో అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పనిచేయాలని సూచించారు. నీరు తగ్గుతున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు.
మరోవైపు వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో బలహీన పడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో, ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 5న పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు