ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం చెందిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వంలో ప్రక్షాళన కోరుతున్న జి-23 బృందం నాయకులు తమ కార్యకలాపాలను ఉధృతం చేయడంతో ఆ పార్టీలో కలకలం చెలరేగుతుంది. మొదటిసారిగా మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంపై తమకు నమ్మకం లేదని, పార్టీకి కొత్తగా సమిష్టి నాయకత్వం అవసరమని బహిరంగంగా స్పష్టం చేశారు.
దానితో ఖంగారు పడిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అర్ధాంతరంగా నష్టనివారణ చర్యలు చేపట్టారు. సోనియా స్వయంగా బుధవారం రాత్రి ఈ నేతల సమావేశం జరిగిన కొద్దిసేపటికే గులాబీ నబి ఆజాద్ కు ఫోన్ చేసి మాట్లాడారు. వారి బృందంతో మాట్లాడడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు.
మరోవంక, రాహుల్ గాంధీ హర్యానా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడాతో భేటీ అయ్యారు. రాహుల్ తో భేటీ అయిన వెంటనే ఆయన ఆజాద్ ఇంటికి వెళ్లి, ఆయనతో మాట్లాడారో. ఆ సమయంలో రాజ్యసభలో పార్టీ ఉపనేత ఆనంద్ శర్మ కూడా అక్కడే ఉన్నారు.
ఈ నేపథ్యంలో పార్టీలో కీలక మా ర్పులకు అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అంగీకరించినట్లు తెలిసింది. అంతేగాక.. పార్టీ బలోపేతానికి ఓ సలహా బృందం ఏర్పాటుకు వారు యోచిస్తున్నట్లు సమాచారం. అన్నిటికంటే ముఖ్యంగా జీ-23 నేతలతో మొదటిసారిగా చర్చలకు శ్రీకారం చుట్టడం విశేష ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. ఒక విధంగా వారి ఉనికిని వారు గుర్తించినట్లయింది.
ఆదివారం ఆమె జరిపిన సీడబ్ల్యుసి సమావేశం ఆమె నాయకత్వం పట్ల విశ్వాసం ప్రకటిస్తూ, ఇప్పట్లో నాయకత్వం మార్పు అవసరం లేదని ప్రకటించిన రెండు రోజులకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బుధ, గురు వారాలలో వరుసగా జి 23 నేతలు ఆజాద్ ఇంట్లో సమాలోచనలు జరిపారు.
ఈ సందర్భంగా జి 23 నేతలను ఉపమింప చేసేందుకే హూడా మధ్యవర్తిత్వాన్ని రాహుల్ కోరుకున్నట్లు తెలుస్తున్నది. రాయబారం నడిపినట్లు తెలుస్తున్నది. బుధవారం ఆజాద్ నివాసంలో సమావేశమైన జి-23 నాయకులు పార్టీని పటిష్టపరిచేందుకు సమిష్టి నాయకత్వం అవసరమని పేర్కొంటూ ఒక సంయుక్త ప్రకటనపై సంతకం చేశారు.
ఈ సమావేశం అనంతరం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ తమకు రాహుల్ నాయకత్వంపై విశ్వాసం లేదని బహిరంగంగా ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ పార్టీని దిగజార్చే ఉద్దేశం తమకు లేదని, పార్టీని పటిష్టపరచడమే తమ కర్తవ్యమని జి-23 వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అన్ని స్థాయిల్లో సమిష్టి నాయకత్వం, సమిష్టి నిర్ణయాల తీసుకునే వ్యవస్థను స్థాపించాలనే తాము పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నామని వారు చెప్పారు. ఐదు రాష్ట్రాలలో పార్టీ ఓటమి కి బాధ్యులుగా 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో మాత్రమే రాజీనామా చేయించడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆయా రాష్ట్రాలకు ఇన్చార్జులుగా ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ఎందుకు వైదొలగలేదని వారు నిలదీశారు. అలాగే.. ఓటమికి కారణాలను తెలుసుకోవడానికి అధిష్ఠానం నియమించిన నేతలే సదరు పరాజయానికి కారకులని, వారే నివేదిక లివ్వడమేమిటని నిలదీశారు.
జి 23 భేటీలలో కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, పృథ్వీరాజ్ చవాన్, మనీశ్ తివారీ, అఖిలేశ్ ప్రతా్‌పసింగ్, రాజ్ బబ్బర్, శశి థరూర్, పీజే కురియన్, ఎంఏ ఖాన్, రాజీందర్కౌర్ భట్టల్, సందీప్ దీక్షిత్, కుల్దీప్ శర్మ, వివేక్ తన్ఖాతో పాటు కొత్తగా హూడా, మణిశంకర్ అయ్యర్, గుజరాత్ మాజీ సీఎం శంకర్‌సిన్హ్ వాఘేలా, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్ భార్య ప్రణీత్‌కౌర్ హాజరు కావడం గమనార్హం.
కాగా.. హరియాణాలో పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలను హూడా రాహుల్‌కు వివరించినట్లు తెలిసింది. హరియాణా పీసీసీ అధ్యక్ష పీఠాన్ని తనకు లేదా తన కుమారుడు దీపీందర్ హూడాకు అప్పగించాలని హూడా గతంలో పట్టుబట్టగా అధిష్ఠానం ససేమిరా అన్నది. పంజాబ్‌లో గట్టి నేత అమరీందర్‌ను ఎన్నికల ముందు తప్పించి చావుదెబ్బ తిన్న అధిష్ఠానం హరియాణా ప్రజల్లో గట్టి పట్టున్న హూడాను వదులుకోవడానికి సిద్ధంగా లేదు.
మరోవంక, ప్రియాంకాగాంధీని యూపీ ఇన్చార్జిగా నియమించడం కాంగ్రె్‌సను రాజకీయంగా దెబ్బతీసిందని గుజరాత్ మాజీ సీఎం వాఘేలా విమర్శించారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ మరణించాక ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదని.. అందుకే తాజా పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. హోలీ దహనంతో పాటే కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యలు కూడా కాలి బూడిదవుతాయన్న ఆశాభావం వ్యక్తంచేశారు.
మరోవంక, ఎన్నికల్లో ఓటములకు సోనియా, రాహుల్‌గాంధీలను మాత్రమే బాధ్యులను చేయలేమని అంటూ వారిని కాపాడేందుకు మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ప్రయత్నం చేశారు. బ్లాక్ స్థాయి నుంచి ఏఐసీసీ స్థాయి వరకు నాయకత్వంలో ఉన్నవారంతా బాధ్యులేనని చెబుతూ ఎవ్వరు బాధ్యులు కాదన్నట్లుగా సంకేతం ఇచ్చారు.