తెలంగాణ ప్రతిష్టాత్మకంగా పుననిర్మించిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పునఃదర్శనం భక్త జనానికి దొరకనుంది. ఈ మేరకు ఆలయ కమిటీ అధికారులు ఈ నెల 28 న ముహుర్తం ఖరారు చేసి, అందుకు సంభంధించి సఖల ఏర్పాట్లూ పూర్తి చేశారు.
ఆ రోజున ఉదయం 11:55 నిమిషాలకు మహా కుంభ సంప్రోక్షణ పూజ తో శాస్త్రోక్తంగా ఆలయం పునఃప్రారంభం కానుందనీ, సంప్రోక్షణానంతరం మూలవిరాట్ దర్శనానికి అనుమతిస్తామనీ యాదగిరి గుట్ట ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. మొదటి రోజైన సోమవారం నాడు మహా కుంభ సంప్రోక్షణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గోనున్నారని తెలిపారు.
సంప్రోక్షణానంతరం యధావిధిగా పూజాకార్యక్రమాలుంటాయని పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి వారం రోజుల పాటు బాలాలయంలో పంచ కుండాత్మక యాగం నిర్వహించనున్నారనీ, 108 మంది పారాయణదారులు, ఆలయ అర్చకులు, వారి శిష్య బృందంతో ఈ మహా క్రతువు నిర్వహిస్తారని తెలియజేశారు.
అంతే కాకుండా ఆలయంలోని స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయాత్రగా ప్రధాన ఆలయానికి తరలిస్తామని చెప్పారు. కాగా తెల్లవారుఝాము నుంచి మొదలయ్యే పూజాసమయాలలో భక్తులను స్వామి దర్శనానికి అనుమతించడం లేదనీ, అందుకు బదులుగా అదే రోజు మధ్యాహ్నం నుండి భక్తుల రాకకు అనుమతులిస్తామని ఈవో స్పష్టం చేశారు.
ఇప్పటికైతే యాదాద్రి ఆలయ గోపుర కలశాలకు సంప్రోక్షణా పూజాఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. లక్ష్మీనరసింహుని దర్శనానికి విచ్చేసే భక్తులకు జియో ట్యాగింగ్ ని కూడా ఉపయోగిస్తామని ఈవో గీతారెడ్డి తెలియజేశారు.
చిన్నజియ్యర్ కు అందని ఆహ్వానం
కాగా, యాదాద్రి ఆలయ ప్రారంభానికి చినజీయర్‌కు ఆహ్వానం అందలేదు. ఆలయ ప్రారంభ ప్రక్రియకు సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేరును ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదు. ఈ యాగంలో 108 మంది పురోహితులు, వేద పండితులు పాల్గొననున్నారని కలెక్టర్ సమేలా సత్పతి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
చినజీయర్ పెట్టిన ముహూర్తానికే పూజలు జరుగుతాయని ఆ ప్రకటన పేర్కొంది. కానీ, ఆయన ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తారని ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం.కాగా, ఆలయాన్ని మాత్రం తామే ప్రారంభిస్తామని స్థానిక అర్చకులు తెలపడం గమనార్హం.