వనదేవతలు సమ్మక్క, సారలమ్మల మీద తాను అభ్యంతరకర వాఖ్యలు చేసాను అంటూ తనపై పెద్ద వివాదం చెలరేగడం పట్ల త్రిదండి చినజీయర్ స్వామి విస్మయం వ్యక్తం చేశారు. తానెప్పుడో 20 ఏళ్ళ క్రితం, ఏదో సందర్భంలో చేసిన కొన్ని వాఖ్యాలను అటు, ఇటు మార్చి వివాదాన్ని ఎవ్వరు, ఎందుకు సృష్టించారో తనకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో చినజీయర్ స్వామి ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ గ్రామదేవతలను తూలనాడినట్లుగా ఆరోపణలని తీవ్రంగా ఖండించారు. “కానీ, అది వాస్తవం కాదు. పనికట్టుకుని.. వాళ్ల సొంత లాభం కోసమే కొందరు ఇదంతా చేస్తున్నారు” అని ఆరోపించారు.
ఉక్రెయిన్ యుద్ధ హడావిడి తగ్గింది కాబట్టే పనికట్టుకుని తన వ్యాఖ్యలను తెర మీదకు తీసుకొచ్చినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. “ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. అది సబబాకాదా అనేది వారి విచక్షణకే వదిలేస్తున్నాం. సమాజ హితం లేని వాళ్లే ఇలాంటి ప్రచారాలకు పూనుకుంటున్నారు” అంటూ విచారం వ్యక్తం చేశారు.
తాను ఆదివాసీ గ్రామ దేవతలను అవమానపరిచాననడం సరికాదని స్పష్టం చేశారు. “మేం ఎలాంటి దురుద్దేశపూర్వక కామెంట్లు చేయలేదు. అవి 20 ఏళ్ల కిందటి కామెంట్లు. విమర్శించేవాళ్లు నా వ్యాఖ్యలపై పూర్వాపరాలు ఒకసారి పరిశీలించాలి. అప్పుడే ఆ వ్యాఖ్యల ఆంతర్యం తెలుస్తుంది” అని హితవు చెప్పారు.
వ్యాఖ్యలపై తాత్పర్యం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే జాలిపడాల్సి వస్తుందని చెబుతూ, పైగా ఆ వ్యాఖ్యలను ఎడిటింగ్ చేసి తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ప్రపంచంలో అనేక రకాల పద్ధతులు ఉంటాయి. ఎవరి పద్ధతిలో వాళ్లు ఉండాలి. మన పద్ధతిని మనం ఆరాధించుకోవాలి. ఎవరినీ చిన్నచూపు చూడం అనేది ఉండదని స్పష్టం చేశారు.
ఒకళ్లని లేదా కొంత మంది దేవతలను చిన్నచూపు చూసే అలవాటు తనకు అస్సలు లేదని తేల్చి చెప్పారు. అందర్నీ గౌరవించాలన్నదే తమ విధానం అంటూ అలాగే అన్నీ నేను నమ్మాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. . వివాదంపై వారికే వదిలేస్తున్నా అని చినజీయర్ స్వామి తెలిపారు. అయితే కొందరు సొంత లాభం కోసమే వివాదం చేస్తున్నారని విమర్శించారు.
ఆదివాసీల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి వీలైనంత సేవ చేస్తున్నామని గుర్తు చేస్తూ తమకు కుల, మతం తేడాలు లేవని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మతాలకతీతంగా ప్రజలు వస్తుంటారుని చెబుతూ కులాన్ని పక్కనపెట్టి.. జ్ఞానసంపదను ఆరాధించాలని సూచించారు. ఇదే రామానుజాచార్యులవారు చెప్పిందని తెలిపారు.
ఆదివాసీలకు ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి వచ్చామని చెప్పారు. మహిళలను చిన్నచూపు చూసేవాళ్లను ఎట్టిపరిస్థితుల్లో ప్రొత్సహించమని స్పష్టం చేశారు.