కాంగ్రెస్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాలు సవాల్ చేస్తున్నరీతిలో గత ఏడాది కాలంగా అసమ్మతి బహిరంగంగా వ్యక్తం చేస్తున్న జి23 నేతలతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాజీ పడ్డారా? మొదటిసారిగా, సోనియా, రాహుల్ ఒక మెట్టు దిగి వారితో మాటలు కలపడంతో, వారు మెత్తబడినట్లు కనిపిస్తున్నది.
జి23 బృందంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాబీ నబి ఆజాద్ శుక్రవారం రాత్రి సోనియా గాంధీ ఇంటికి వెళ్లి, ఆమెతో గంటసేపటికి పైగా సమాలోచనలు జరపడం, బైటకు వచ్చిన తర్వాత తమ నాయకురాలు సోనియా గాంధీనే అని స్పష్టం చేసినప్పటికీ పార్టీ అధ్యక్ష పదవిని గాంధీ కుటుంభం వదులుకోవాలని స్పష్టం చేసిన్నట్లు తెలుస్తున్నది.
రాహుల్ గాంధీ లోక్ సభలో పార్టీ నాయకత్వ పదవిని చేపట్టి, పార్టీ అధ్యక్ష పదవిని కుటుంభం వెలుపల వ్యక్తికి ఇవ్వాలని ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. అందుకు సోనియా సహితం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు చెబుతున్నారు. ఈ భేటీలో పార్టీలో అధికార పంపకమే కీలక అంశంగా చర్చించినట్లు చెబుతున్నారు.
రెండు రోజుల పాటు ఆజాద్ నివాసంలో అసమ్మతివాదుల వరుస భేటీల తరువాత సోనియాతో ఈ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షురాలిని తాను కలిసినట్లు, ఈ భేటీ బాగా జరిగినట్లు ఆ తరువాత ఆజాద్ విలేకరులకు తెలిపారు. ఇది సత్ఫలితాల భేటీ అని వ్యాఖ్యానించారు. పార్టీలో అంతర్గతంగా నాయకత్వంపై అసంతృప్తి ఉందనే వాదనను ఆజాద్ కొట్టిపారేశారు.
సోనియానే పార్టీ పగ్గాలు చేపట్టాలని, ఆమె నాయకత్వం కొనసాగాలని పార్టీలోని నేతలంతా ఏకగ్రీవంగా నిర్ణయించారని, ఇందులో ఎటువంటి తేడా అభిప్రాయభేదాలు లేవని ఆజాద్ తేల్చిచెప్పారు. అయితే తమ వైపు నుంచి ఆమెకు కొన్ని సూచనలు ప్రతిపాదనలు ఈ భేటీ దశలో అందించామని వివరించారు.
ఐదు రాష్ట్రాలలో పరాజయానికి సంబంధించి వర్కింగ్ కమిటీ అందరు నేతల అభిప్రాయాలను కోరిందని, వీటిని ఆమెకు తెలియచేశామని ఆజాద్ చెప్పారు. త్వరలో జరిగే మరికొన్ని అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని గెలిపించేందుకు సంఘటితంగా వ్యవహరించి ముందుకు సాగాలని సంకల్పించినట్లు ఆజాద్ వివరించారు. ఈ దిశలోనే ఇప్పటి భేటీ జరిగిందని పేర్కొన్నారు.
నాయకత్వంపై ఎటువంటి ప్రశ్న తలెత్తలేదని స్పష్టం చేశారు. అయితే పార్టీలో సమిష్టి నాయకత్వం అవసరమని రెండు రోజుల క్రితం ఈ నేతలు స్పష్టం చేయడం గమనార్హం. బుధవారం నుంచి ఆజాద్ ఇతర కొందరు నేతలతో తమ నివాసంలో సమావేశం అవుతూ వచ్చారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరగాలని, కొత్త నాయకత్వం ఎంపికపై తొందరలోనే కీలక సమావేశం ఏర్పాటు జరగాలనే అంశాలతో జి 23 నేతల భేటీ జరిగింది.
ఈ దశలోనే పార్టీలోని అసమ్మతినేతలందరితో మాట్లాడాలని, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని రాహుల్ గాంధీ చేసిన సూచనల మేరకు సోనియా స్వయంగా ఇప్పుడు ఆజాద్‌ను కలిసినట్లు వెల్లడైంది. ఒక్కరోజు క్రితం రాహుల్ హర్యానా మాజీ సిఎం భూపీందర్ సింగ్ హూడాను కలిశారు.