భారత్‌లో రాబోయే ఐదేళ్లలో సుమారు రూ.3.2 లక్షల కోట్ల (5 ట్రిలియన్ యెన్లు) పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా శనివారం ప్రకటించారు. ఈ పెట్టుబడుల ద్వారా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ), చిన్న తరహా పరిశ్రమల్లో పరస్పర పోటీ భాగస్వామ్యం కోసం ఒక రోడ్‌మ్యాప్ సిద్ధమైందని భారత విదేశాంగ కార్యదర్శి హర్షా తెలిపారు.
భారత్-జపాన్ వార్షిక సదస్సును పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కిషిదా శనివారం హైదరాబాద్ హౌస్‌లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య గల ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని సమీక్షించి, మరింత బలోపేతం చేయడాన్ని చర్చించారు. కాగా, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి ఈ ఏడాదితో 70 ఏళ్లు పూర్తవుతున్నాయి. గతేడాది ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా కిషిదా భారత్‌లో పర్యటిస్తున్నారు.
భారత్‌తో భద్రతా, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ రెండు రోజుల పాటు వార్షిక సదస్సు జరుగుతోంది. ఈ భేటీ అనంతరం విదేశాంగ కార్యదర్శి హర్షా శృంగ్లా మాట్లాడుతూ భారత్‌లో జపాన్ పెట్టుబడుల లక్ష్యాన్ని 2014-19లో 3.5 ట్రిలియన్ యెన్లు నిర్దేశించుకోగా..ఇప్పుడు దానిని 5 ట్రిలియన్ యెన్లకు పెంచినట్లు తెలిపారు.
సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ), చిన్న తరహా పరిశ్రమల్లో పరస్పర పోటీ భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసినట్లు చెప్పారు. అలాగే ముంబయి – అహమ్మదాబాద్ శింకన్‌సేన్ బుల్టెట్టు రైలు ప్రాజెక్టును పూర్తి చేసే ప్రయత్నాలను జపాన్ వేగవంతం చేయనుందని హర్షా పేర్కొన్నారు.
అంతకుముందు ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో కిషిదాకు ఘన స్వాగతం లభించింది. కిషిదా వెంట ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. జపాన్‌తో భారత్ స్నేహ సంబంధాలు మరింత ముందుకు తీసుకెళ్ళేలా ఈ సమావేశం జరిగిందని, ఇరువురు నేతలు ఫలప్రదమైన చర్చలు జరిపారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు బలోపేతమయ్యేందుకు చేపట్టాల్సిన చర్యలపై నేతలు చర్చించారని, వివిధ అంశాలపై ఇరు దేశాలు కలిసి కృషి చేయాలని నిర్ణయించినట్లు ట్వీట్ చేసింది. ఇరు దేశాల మధ్య వూహాత్మక సంబంధాలను పటిష్టపరుచుకోవాలని నేతలు ఆకాంక్షించారని పేర్కొంది.
ఉక్రెయిన్‌పై ఐక్య వైఖరి అవసరం
భారత్‌కు రావడానికి ముందుగా కిషిదా మాట్లాడుతూ, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఐక్యత నెలకొనాల్సిన ప్రాముఖ్యతను నొక్కిచెప్పాలని భావిస్తున్నట్లు చెప్పారు. రష్యా దాడులను భారత్ ఇప్పటివరకు ఖండించలేదు.
ఈ నేపథ్యంలో కిషిదా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దాడులు ప్రారం భమైనప్పటి నుండి జపాన్ డజన్ల సంఖ్యలో రష్యన్లపై, సంస్థ లపై ఆంక్షలు విధించింది. క్వాడ్ సభ్య దేశాల్లో ఇప్పటివరకు రష్యాపై ఎటువంటి ప్రకటన చేయనిది భారత్ ఒక్కటే.
వాణ్యి సంబంధాలు పరిపుష్టం
భారత్, జపాన్ 14వ వార్షిక సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇరు దేశాల సంబంధాలకు ”పురోగతి, సౌభాగ్యం, భాగస్వామ్యం”లు ప్రాతిపదికగా వుంటాయని చెప్పారు. భారత్‌లోని జపాన్ కంపెనీలకు సాధ్యమైనన్ని రకాలుగా మద్దతు అందించడానికి భారత్ కట్టుబడి వుందని తెలిపారు.
సైబర్ భద్రత, సామర్ధ్య నిర్మాణం, సమాచార మార్పిడి, సహకారం రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలపై సంతకాలు జరిగాయని పేర్కొన్నారు. ముంబయి-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్‌పై ఒక బృందం-ఒక ప్రాజెక్టుగా ఇరుదేశాలు పనిచేస్తున్నాయని మోడీ తెలిపారు. జపాన్‌తో వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.