తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 20 రోజులుగా వెంటిలేటర్‌పై ట్రీట్మెంట్ పొందుతున్నారని, శనివారం సాయంత్రం మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
స్వరాజ్యం పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల దాకా హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు సీపీఎం వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12 గంటలకు భౌతికకాయాన్ని నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించి అక్కడ సభ నిర్వహించనున్నట్లు తెలిపాయి. తర్వాత నల్గొండ మెడికల్ కాలేజీ విద్యార్థులకు పరిశోధన నిమిత్తం భౌతికకాయాన్ని అప్పగించనున్నట్లు పేర్కొన్నాయి.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931లో మల్లు స్వరాజ్యం జన్మించారు. 5వ తరగతి వరకు చదువుకున్న ఆమె.. తన సోదరుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి అడుగుజాడల్లో సాయుధ పోరాటంలోకి దిగారు. 13 ఏండ్ల వయసులోనే పల్లెపల్లెకూ తిరిగి విప్లవ గీతాలు పాడారు. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రైతులు, ప్రజల్లో చైతన్యం రగిలించారు.
నాడు ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. 16 ఏండ్ల వయసులోనే తుపాకీ పట్టి దొరలపై తిరుగుబాటు చేశారు. సాయుధ పోరాటంలో మొట్టమొదట తుపాకీ పట్టిన మహిళ మల్లు స్వరాజ్యం. 1945- – 48 దాకా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును మల్లు స్వరాజ్యం గడగడలాడించారు. గెరిల్లా దళాలతో జరిగిన పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు.
రజాకార్లను దీటుగా ఎదుర్కొన్నారు. నిలువరించారు. ఈ క్రమంలో కొంత కాలం అజ్ఞాతంలో ఉండిపోయారు. మల్లు స్వరాజ్యాన్ని పట్టుకోవడం చేతి కాని నైజాం పాలకులు.. ఆమె ఇంటిని తగులబెట్టారు. ఆమెను పట్టుకున్న వారికి రూ.10 వేల బహుమతి ఇస్తామని ప్రకటించారు. కానీ దొరల పాచికలు పారలేదు. అజ్ఞాత కాలంలో రాజక్కగా పేరు మార్చుకొని మల్లు స్వరాజ్యం రహస్య జీవితం గడిపారు.
ఉద్యమం ముగిశాక 1954 మార్చి 3వ తేదీన హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దేవులపల్లి వెంకటేశ్వరరావు నివాసంలో మల్లు నర్సింహారెడ్డిని స్వరాజ్యం పెండ్లి చేసుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రజా ఉద్యమం నుంచి దూరం కావొద్దని ప్రమాణం చేసుకొని మరీ వారిద్దరూ ఒక్కటయ్యారు.
సాయుధ పోరాటం ముగిసిన తర్వాత రాజకీయాల్లోకి స్వరాజ్యం ప్రవేశించారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1978, 1983లలో రెండు సార్లు సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. పార్టీ రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. వామపక్ష భావాలతో స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక ‘చైతన్య మానవి’ సంపాదక వర్గంలో ఒకరిగా పని చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంలో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పనిచేశారు. స్వరాజ్యం భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి.. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా చాలాకాలం పని చేశారు. ఆమె సోదరుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి.. అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు.
స్వరాజ్యంకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు మల్లు గౌతంరెడ్డి.. సీపీఎం నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా పని చేస్తున్నారు. చిన్న కుమారుడు మల్లు నాగార్జున్ రెడ్డి సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు.
మల్లు స్వరాజ్యం మృతికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారని, ఆమె జీవన గమనం, గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తిదాయకమని సీఎం కేసీఆర్ కొనియాడారు. చివరి వరకు నమ్మిన సిద్ధాంతాల కోసం మల్లు స్వరాజ్యం పనిచేశారని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం వారిపక్షాన నిలబడ్డారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
మల్లు స్వరాజ్యం పోరాట పట్టుదల ఎందరికో ఆదర్శమని, ప్రజా సేవకు పరితపిస్తూ నిత్యం సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల గుండెల్లో ఆమె నిలిచారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు, రాజాకర్ల దురాగాతలకు వ్యతరేకంగా సాయుధ పోరాటం చేసిన ధీరవనిత మల్లు స్వరాజ్యం అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. చివరి శ్వాస వరకు ఆమె పార్టీ కేంద్ర కమిటీ ఆహ్వానితురాలిగా ఉన్నారని తెలిపారు.
చిన్న వయసులోనే కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి చివరి శ్వాస వరకు ప్రజా పోరాటాల్లో కొనసాగిన విప్లవనారి మల్లు స్వరాజ్యం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించారని, ఎమ్మెల్యేగా రైతులు, శ్రామికులు, పేదల తరపున వాణి వినిపించారని సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు.
మల్లు స్వరాజ్యం మరణంతో కంచుకంఠం మూగబోయిందని సీపీఐ నేత నారాయణ చెప్పారు. నైజాం వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ముఖ్య భూమిక పోషించారని, తుపాకీ పట్టిన వీర వనిత ఆమె అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. పేదల కోసం మల్లు స్వరాజ్యం చేసిన పోరాటాలు చిరస్మరణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.
ఆమె మరణం తెలంగాణ రాష్ట్రానికి, పేదలకు తీరని లోటు అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన వీర వనిత మల్లు స్వరాజ్యం అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొనియాడారు. దోపిడీ పాలకవర్గాలకు వ్యతిరేకంగా, కమ్యూనిస్టుల ఐక్యత కోసం మల్లు స్వరాజ్యం పరితపించారని ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి తెలిపారు.