ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొద్దిరోజులు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై మౌనంగా ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తిరిగి కేంద్రంపై పోరుకు సిద్దపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మళ్లీ వడ్ల కొట్లాటకు సై అంటున్నారు. యాసంగి వడ్లను తాము కొనేది లేదని, కేంద్రమే కొనాలని తేల్చిచెప్పారు.
ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్‌లో శనివారం మంత్రులు, అధికారులతో కేసీఆర్ జరిపిన అత్యవసర సమావేశంలో ఈ మేరకు కార్యాచరణ ప్రణాలికను రూపొందించారు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా పాల్గొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఉద్యోగాల భర్తీ ప్రకటన తర్వాత యువతలో స్పందన ఎట్లా ఉంది అనే అంశాలతో పాటు యాసంగిలో వడ్ల కొనుగోళ్లపైనా చర్చించినట్టు తెలిసింది.
యాసంగి సీజన్లో వడ్ల కొనుగోళ్లపై చర్చించేందుకు సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ జాయింట్ మీటింగ్ నిర్వహించనున్నారు. మంత్రులతో సమావేశం అనంతరం ఈ మేరకు సీఎంవో నుంచి ప్రకటన విడుదలైంది. ఎల్పీ జాయింట్ మీటింగ్‌కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్పర్సన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని కేసీఆర్ ఆదేశించారు.
రాష్ట్రంలో పండిన యాసంగి వడ్లను కేంద్రమే కచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వానాకాలం సీజన్లోనూ వడ్ల కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఇదే తరహా పోరాటాలు చేసింది. అప్పుడు ఇందిరాపార్క్‌లో నిర్వహించిన ధర్నాకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. రాష్ట్రంలో పండిన వడ్లన్నీ కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిరసన తెలిపారు.
రాష్ట్రం నుంచి ఐదుగురు మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారు. వానాకాలంలో రాష్ట్రం నుంచి 40 లక్షల టన్నులకు తోడు అదనంగా 5 లక్షల టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం ఓకే చెప్పింది. యాసంగిలో వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సహా మొత్తం కేబినెట్, ఎమ్మెల్యేలు, అధికారులు, వ్యవసాయ శాఖ పదే పదే రైతులను హెచ్చరించారు. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని చెప్తున్నదని, కాబట్టి వరి సాగు వద్దే వద్దని చెప్పారు.
అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఆ పార్టీ నేతలంతా రాష్ట్ర ప్రభుత్వ వాదనను తిప్పికొట్టారు. రా రైస్ ఎంత ఇచ్చినా కేంద్రం కొంటామని తేల్చిచెప్పిందన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా యాసంగిలో రైతులు వరి సాగు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా కొనదో చూస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ‘మన ఊరు – మన పోరు’ నినాదంతో సభలు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. వడ్ల కొనుగోళ్లపై రాష్ట్ర సర్కారు తీరును బీజేపీ ఎండగడుతున్నది. తమ పొలాల్లో వడ్లు తప్ప వేరే పంట పండదని కొందరు రైతులు.. ఇతర పంటలు వేస్తే గిట్టుబాటు కాదని ఇంకొందరు రైతులు యాసంగిలో వరిని సాగు చేశారు.
ఇట్లా యాసంగి సీజన్లో 36 లక్షల ఎకరాల్లో వరిసాగవుతున్నది. 83 లక్షల టన్నుల బియ్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. పంటలు చేతికి వస్తుండటంతో ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు రాష్ట్ర సర్కారుపై పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే రైతుల్లో వ్యతిరేకత ఎదురవుతుందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై యుద్ధానికి దిగుతున్నట్టు ప్రకటించింది. దానిపై వ్యూహ రచన కోసం టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాం హౌస్ నుంచి మంత్రులకు ఉదయం ఫోన్ చేసి అత్యవసరంగా రావాలని పిలిపించుకున్నారు. అధికారిక కార్యక్రమాల్లో ఉన్న హరీశ్‌రావు అప్పటికప్పుడు వాటిని రద్దు చేసుకొని ఫాంహౌస్‌కు చేరుకున్నారు. మిగతా మంత్రులు మధ్యాహ్నం 12 గంటలలోపే ఫాంహౌస్‌కు వచ్చారు. మంత్రులు, సీఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు వివిధ శాఖల హెచ్‌వోడీలతో సీఎం సమావేశమయ్యారు.
సుమారు నాలుగున్న గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. అనంతరం అధికారులు హైదరాబాద్‌కు వచ్చేయగా మంత్రులతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా పాల్గొన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్న అంశాలతో పాటు ప్రజలు ఆగ్రహంతో ఉన్న అంశాలపైనా ఆయన ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్టు సమాచారం.
ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రకటన తర్వాత యువత ఏమనుకుంటున్నారు? ఇతర రాజకీయ అంశాలపైనా తన సర్వేలో తేలిన అంశాలపై పీకే చర్చించినట్టు తెలిసింది. మంత్రులతో సీఎం సమావేశం కొనసాగుతుండగానే 21న టీఆర్ఎస్ ఎల్పీ భేటీ, ఢిల్లీకి సీఎం సహా మంత్రులు వెళ్తారని సీఎంవో నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కేంద్రంపై పోరు, రాష్ట్రంలో బీజేపీని నిలువరించడం సహా అనేక అంశాలు వీరి భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది.
సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్, మహారాష్ట్ర టూర్లో ఉన్న నిరంజన్ రెడ్డి, ఖమ్మంలో ఉన్న పువ్వాడ అజయ్, మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న సత్యవతి రాథోడ్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ ఆయనను ఈ సమావేశానికి ఆహ్వానించలేదని తెలిసింది.