కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ (74) తన నాయకత్వంలోని లోక్‌తంత్రిక్ జనతా దళ్ (ఎల్‌జెడి) పార్టీని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడి)లో ఆదివారం విలీనం చేశారు. శరద్ యాదవ్‌ను ఆర్జెడి నేత తేజస్వీ యాదవ్ తమ పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. పాతిక సంవత్సరాల తరువాత ఈ పార్టీల విలీనం చోటుచేసుకుంది.
బిజెపిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఐక్యమవ్వాలని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శరద్ యాదవ్, తేజస్వీ యాదవ్ పిలుపునిచ్చారు. ఇప్పుడు బీహార్‌కు తేజస్వీ యాదవ్ ఆశాజ్యోతి. బిజెపి వ్యతిరేక శక్తులకు స్ఫూర్తిగా నిలిచారు. ఇటువంటి యువతరం నేతల నాయకత్వం అత్యవసరం అని, ఆర్జేడీని అంతా బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ దిశలోనే తమ పార్టీని ఆర్జేడీలో విలీనం చేస్తున్నామని చెప్పారు.
తొలినాళ్లలో ఆర్జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ ఇరువురు జనతా దళ్‌లో పనిచేశారు. 1997లో లాలూ జనతా దళ్ వీడి ఆర్జెడి స్థాపించారు. శరద్ యాదవ్ కూడా జనతా దళ్ యునైటెడ్ (జెడియు)లో చేరి నితీష్ కుమార్‌తో చేతులు కలిపారు. 2015లో బిజెపితో పోరాడేందుకు జెడియుా- ఆర్జెడిని ఏకతాటిపై తీసుకురావడంలో శరద్ కీలక భూమిక పోషించారు.
నితీష్ మళ్లీ బిజెపితో జట్టు కట్టడంతో శరద్ యాదవ్ విడిపోయి ఎల్జెడిని స్థాపించారు. ఇప్పుడు ఆ పార్టీని ఆర్జెడిలో విలీనీం చేశారు. పాతికేళ్ల క్రితం లాలూతో విభేధాలు ఏర్పడి శరద్ యాదవ్ సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడంతో బీహార్‌లోని దళిత, ముస్లిం, బిసి యాదవ్‌ల ఓట్లలో చీలిక ఏర్పడింది. అప్పటి నుంచి బిజెపి మిత్రపక్షాలే బీహార్‌లో రాజకీయంగా పైచేయిగా ఉంటున్నాయి.