పార్టీ అగ్రనేతలు వరుసగా సమస్యలతో మృతి చెందడంతో, లొంగి పోవడమో, భద్రతా దళాల కాల్పులలో మరణించడమో, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడంతో జరగడంతో కొద్దీ కాలంగా తెలుగు జిల్లాలో మావోయిస్టు కార్యక్రమాలు స్తంభించి పోయాయి. సరిహద్దు ప్రాంతాలలో కొద్దిపాటి కార్యకలాపాలతో తమ ఉనికిని చాటుకొంటున్న వారిలో కొత్తగా చేరే యువత ఉండడం లేదు.
ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాల నుండి పోలీస్ నిఘా పెరగడంతో వెళ్లిన మావోయిస్టు నాయకులే పార్టీని విస్తరించడంతో కీలక పాత్ర వహిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయా రాష్ట్రాలలో స్థానిక నాయకత్వం అభివృద్ధి చెందడంతో తెలుగు ప్రాంతాల నాయకులతో అవసరం లేకపోయింది.
రెండు రాష్ట్రాల పోలీసులు సహితం మావోయిస్టు సమస్యను పరిష్కరించమనే ధీమాతోనే, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల ప్రయోజనాలను కాపాడటంలో నిమగ్నమై ఉండడంతోనే మావోయిస్టు సమస్యపై కొంతకాలంగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఫలితంగా కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాలలో వారు తిరిగి పుంజుకొంటున్నట్లు తెలుస్తున్నది.
వారిప్పుడు వ్యూహాత్మకంగా ఒకొక్క చోట ఒకొక్క సమస్యను చేపడుతూ, స్థానికంగా అటవీ, గ్రామీణ ప్రజలతో మమేకమైపోతూ తమ క్యాడర్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడైనది. ముఖ్యంగా తెలంగాణపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలతో విస్తరించిన దండకారణ్యంలో మావోయిస్టులు ఏళ్ల తరబడి ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్‌గా మార్చుకున్నారు. ఎన్కౌంటర్ల రూపంలో ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ, వెనక్కి తగ్గకుండా ఎప్పటికప్పుడు బలం పుంజుకుంటూ సమీకృతం అవుతున్నారు.
ఇటీవల మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ- సభ్యుడు, వ్యూహకర్త కంచన్‌దా అలియాస్ అరుణ్‌కుమార్‌ను అసోం పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా వారి ఎత్తుగడలు వెలుగులోకి వచ్చిన్నట్లు పోలీస్ వర్గాలు నిర్ధారిస్తున్నారు. ఆయన వద్ద దొరికిన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, రూ.3.6 లక్షల నగదు, పలు కీలక పత్రాల ఆధారంగా పలు కీలక అంశాలు భద్రతా వర్గాల దృష్టికి వచ్చాయి.
కంచన్‌దా విచారణ సందర్భంగా తెలంగాణతో పాటు ఒడిశా, ఝార్ఖండ్, చత్తీసగఢ్ యువతపైన కూడా మావోలు దృష్టి సారించినట్లు వెల్లడైంది. రిక్రూట్మెంట్లు అవ్వగానే శిక్షణనిచ్చి, వారికి ఆయుధాలను సరఫరా చేయాలని నిర్ణయించినట్లు అసోం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అందుకోసం అత్యాధునిక ఆయుధాల సరఫరాకు సహితం రంగం సిద్దంచేసిన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే పెద్ద ఎత్తున హింసాయుత చర్యలకు పాల్పడే అవకాశం ఉంది.
ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడంతో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, ఆదివాసీలను ముప్పుతిప్పలు పెడుతున్న పోడు భూముల సమస్య, సహజ వనరులను మాయం చేసేందుకు సాగుతున్న వరుస కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీ యువతను ఆకర్షిస్తున్న ట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం పెద్దఎత్తున యువత శిక్షణలో కొనసాగుతుండగా, వారందరికీ అత్యంత ఆధునిక ఆయుధాలను అప్పగించి, సాయుధ దళాల్లో చేర్చుకొని, వరుస దాడులతో ఉనికిని చాటాలన్నది మావోయిస్టుల వ్యూహంగా కనిపిస్తోంది.
అసోం పోలీసులు వెల్లడించిన అంశాల ప్రకారం అస్సోంలోని తీవ్రవాద సంస్థ లైన ఉల్ఫా వంటి నిషేధిత సంస్థ ల నుంచి పెద్ద ఎత్తున ఆధునిక ఆయుధాలు, బాంబులు, గ్రేనేడ్లను మావోయిస్టులు సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఏజెన్సీ ప్రాంత బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.