చైనాలో సోమవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. 133 మందితో వెళుతున్న బోయింగ్ 737 విమానం నైరుతి చైనాలో కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా మంటలు అలముకున్నాయి. ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయి ఉంటారని స్థానిక మీడియా చెబుతోంది.
సోమవారం మధ్యాహ్నం 1.11 నుంచి బయలుదేరిన ‘చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్’కు చెందిన విమానం 2.22 గంటలకు ప్రమాదానికి గురైంది. గ్వాంగ్చీ ప్రాంతంలోని కొండల్లో విమానం కూలిపోయినట్టుగా తెలుస్తోంది. ఈమేరకు చైనా అధికారిక ప్రసార మాధ్యమాల్లో ప్రసారమైంది. ప్రమాదం జరిగిన కొండ ప్రాంతంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. విమానం నుంచి మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి.
గ్వాంగ్జౌ రీజియన్లోని వుజౌ నగరానికి సమీపంలోని ఓ గ్రామీణ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాంతీయ అత్యవసర మేనేజ్మెంట్ బ్యూరో తెలిపినట్లు పేర్కొంది. సమాచారం అందిన వెంటనే.. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. చైనా ఈస్ట్రన్ విమానం కున్మింగ్ నుండి గ్వౌంగ్జౌకు వెళుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది.