టీడీపీ హయాంలో పెగాసెస్ కొనలేదని, ఎవ్వరి ఫోన్లు టాప్ చేయడం కూడా జరగలేదని మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ ఆరోపించడం, దానిపై వైసిపి సభ్యులు రాష్ట్ర శాసనసభలో చర్చకు పెట్టి, స్పీకర్ సభాసంఘం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం పట్ల స్పందిస్తూ పెగాసెస్ను కొనలేదని డీజీపీ కార్యాలయమే చెప్పిందని గుర్తుచేశారు.
పెగాసెస్ పట్ల తనపై ఆరోపణలు చేయడంతో వల్ల ప్రజల్లో అభద్రతా భావం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నిఘా చీఫ్గా ఉన్నందున తనకు పూర్తి సమాచారం ఉందని, మే 2019 వరకు ఏ ప్రభుత్వ సంస్థ పెగాసెస్ కొనలేదని తెలిపారు. మే 2019 తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు.
లేనిపోని అపోహలతో ప్రజల్లో భయాందోళన కలిగించవద్దని సూచించారు. కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని ఏబీవి ఎద్దేవాచేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరి ఫోన్లు ట్యాప్ కాలేదని తెలిపారు. తనపై అనేక ఆరోపణలు చేశారని, సీఎస్ ఆఫీస్కు మూడు వినతిప్రతాలు ఇచ్చానని చెప్పారు. తనపై విచారణ త్వరగా ముగించి తుది నిర్ణయం తీసుకోవాలని కోరానని పేర్కొన్నారు.
ఏపీ నుంచి కొన్ని పత్రాలు రాలేదని కేంద్రం చెబుతోందని చెబుతూ తన సస్పెన్షన్ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని వెంకటేశ్వరరావు తెలిపారు. ‘‘ఏ విచారణ నుంచి నేను తప్పించుకోలేదు. నాపై విచారణ సమయంలో కొన్ని పత్రాలను ఫోర్జరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. 2021 ఏప్రిల్లో అడిగినా ఇప్పటివరకు చలనం లేదు. నాపై అసత్యాలు, అన్యాయమైన ఆరోపణలు చేస్తున్నారు” అని ఆరోపించారు.
కొందరిపై పరువు నష్టం దావా వేసేందుకు అనుమతివ్వాలని కోరానాని పేర్కొంటూ తన సస్పెన్షన్పై కోర్టులో చాలెంజ్ చేశానని చెప్పారు. తనపై బురద చల్లడం, వ్యక్తిత్వ హననం ఎంతవరకు వాస్తవమో తనకు తెలుసని అంటూ ఏ విచారణకైనా వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. నిజానిజాలు త్వరగా తేల్చాలని మాత్రమే అడుగుతున్నట్లు తెలిపారు.
30 ఏళ్లపాటు వృత్తి ధర్మం పాటించా.. దేశద్రోహిని ఎలా అవుతా? తనపై రాసిన అసత్య వార్తలు చదివి బంధువులు, మిత్రులు ఏమనుకుంటారు? అని ప్రశ్నించారు. పెగాసెస్ పట్ల కూడా తనపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అంటూ అసత్యాలు ప్రచారం చేస్తే రేపు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎలా పనిచేస్తారని నిలదీశారు.
‘‘ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నానని..ఇష్టానుసారం అబద్ధాలు ప్రచారం చేస్తారా?. నాకు సిగ్గు లజ్జ ఉన్నాయి..ముందు మనిషిని, తర్వాతే ఉద్యోగిని. పది జిల్లాల్లో పని చేశా..ఎక్కడైనా అవినీతి నిరూపించమనండి” అంటూ సవాల్ చేశారు.
“నా క్యారెక్టర్ కాపాడుకుంటూ పనిచేస్తే ఇప్పుడు ఆరోపణలా?. బెదిరింపులకు భయపడి పారిపోవాలా?” అని అడిగారు. పెగాసెస్ విషయంలో ఎవరికీ అనుమానాలొద్దని చెబుతూ తమ ఫోన్లు ట్యాప్ చేశారని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల కోర్టులో కేసులు వేశారని పేర్కొంటూ ఫోన్ ట్యాపింగ్ కరెక్ట్ కాదని తాను నోటీసులకు జవాబిచ్చానాని గుర్తు చేశారు.
ప్రభుత్వం మారిన 6 నెలల తర్వాత వైవీ సుబ్బారెడ్డి కోర్టు కేసు వాపస్ తీసుకున్నారని చెప్పారు. ఎందుకు అలా చేశారో తనకు తెలియదని అంటూ సజ్జల వేసిన కేసును హైకోర్టు డిస్మిస్ చేసిందని తెలిపారు. 6 నెలలకోసారి చీఫ్ సెక్రటరీకి వివరాలు ఇచ్చాక.. వారు సంతృప్తి చెందితే పోస్ట్ ఇస్తారని తెలిపారు.
“నేను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నంతకాలం అంతా సవ్యంగా ఉంది. సస్పెన్షన్ ఏడాది దాటకూడదని ఉంది. రెండో ఏడాది కూడా కొనసాగిందంటే ఏ కారణాలు చూపించారో? నాకు అన్యాయం జరిగినా..నేను చేసేదేమీ లేదు. కొన్నిసార్లు నిబంధనల ప్రకారం నడుచుకోవడమే” అని ఎబివి పేర్కొన్నారు.
తననపై రాజకీయ పరమైన విమర్శలు చేశారని, 35 మంది కమ్మ సామాజికవర్గానికి ప్రమోషన్లు ఇచ్చారన్నారని అంటూ తానేమీ తప్పు చేయలేదని స్పష్టం చేశారు..అన్నింటికీ సమాధానం చెబుతానని తేల్చిచెప్పారు. తానేమి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని కొందరి ఆరోపణలపై మాట్లాడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అనుమతిచ్చాకే..కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు.