లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి), ప్రభుత్వ భాగస్వామ్యంలోని ఐడిబిఐ బ్యాంక్‌ను అమ్మడానికి మోడీ సర్కార్ కసరత్తును వేగవంతం చేసింది. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి రోడ్ షోలు నిర్వహించనున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరడ్ తెలిపారు.
ఐడిబిఐ బ్యాంక్ అమ్మకానికి గతేడాది మేలోనే ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ప్రస్తుతం ఈ బ్యాంక్‌లో ఎల్ఐసి, కేంద్రానికి కలిపి 95 శాతం వాటా ఉంది. అయితే ఇందులో ఎవరి వాటాలను ఎంత విక్రయించేదనేది ఇంకా స్పష్టత లేదని మంత్రి పేర్కొన్నారు.
మూలధనం కోసం ఎల్ఐసి, ప్రభుత్వంపై ఆధారపడకుండా ఆ బ్యాంక్ కార్యకలాపాలు సాగడానికి ప్రయివేటీకరణ చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. వాటాల విక్రయం ద్వారా పెట్టుబడులు సమీకరణ, నూతన టెక్నలాజీ. మెరుగైన మేనేజ్మెంట్ నిర్వహణకు అవకాశాలున్నాయని తెలిపారు.
ఐడిబిఐ బ్యాంక్‌లో ప్రస్తుతం ఎల్ఐసికి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం, నాన్ ప్రమోటర్ షేర్హోల్డర్లకు 5.29 శాతం చొప్పున వాటాలున్నాయి. ఇందులోని ప్రభుత్వ, ఎల్ఐసి వాటాల విక్రయానికి వీలుగా ఆసక్తి కలిగిన ఇన్వెస్టర్లలో భేటీలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ వాటా విక్రయ సమయంలో ప్రస్తుత ఉద్యోగులు, వాటాదారులకు సరైన న్యాయం చేస్తామన్నారు. కీలకమైన వీటికి సంబంధించిన ఆ వివరాలు మాత్రం వెల్లడించలేదు.
కాగా.. 2016 నవంబర్ నోట్ల రద్దు తర్వాత ఐడిబిఐ బ్యాంక్ నష్టాల సంక్షోభంలో చిక్కుకుంది. దీని నుంచి కాపడటానికి 2018లో ఎల్ఐసితో దాదాపుగా 39 శాతం వాటాలను కొనుగోలు చేయించడంతో అప్పటికే 10 శాతం వాటాలున్న ఎల్ఐసికి ఇందులో 51 శాతం వాటాకు చేరింది. దీంతో 2019 జనవరి 21 నుంచి ఐడిబిఐ బ్యాంకును ప్రయివేటు రంగ బ్యాంకుల కేటగిరీలో చేర్చుతూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నిర్ణయం తీసుకుంది.