ఆరు నూరైనా ముందస్తు ముచ్చటే లేదని స్పష్టం చేయడం ద్వారా తాము ముందస్తు ఎన్నికలకు వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెరదించారు. ప్రభుత్వ పథకాలు పూర్తి చేయాల్సి ఉన్నందున గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లామని ఆయన చెప్పారు.
ఈసారి 95 నుంచి 105 స్థానాల్లో తాము గెలుస్తామని భరోసా వ్యక్తం చేశారు. 30 స్థానాల్లో సర్వే చేస్తే 29 చోట్ల గెలుస్తామని రిపోర్ట్ వచ్చిందని ఆయన తెలిపారు. ఆ ఒక్క సీటు కూడా 0.3 ఓట్ల తేడాతో పోతుందని తేలిందని ఆయన పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్లో ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. 2018 నాటి పరిస్థితులు రాష్ట్రంలో ఇప్పుడు లేవని తేల్చి చెప్పారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తనతో కలిసి పనిచేస్తున్నాడని, అయితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. దేశంలో పరివర్తన కోసం తాను ప్రశాంత్ కిశోర్‌తో కలిసి పనిచేస్తానన్నారు. గత 8 ఏళ్లుగా పీకేతో తనకు స్నేహం ఉందన్నారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో చాలా శూన్యత ఉందన్నారు. కొత్త జాతీయ పార్టీ వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
25 నుంచి యాసంగి ధాన్యంకై పోరు
కేంద్రం యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 25 నుంచి టీఆర్ఎస్ ఆధ్యర్యంలో రైతు పోరు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ భేటీలో ప్రధానంగా వరి ధాన్యం కొనుగోలు అంశంపై నాయకులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోలుపై ఎంపీలు పార్లమెంట్లో పోరాడాలని కేసీఆర్ సూచించారు.
పంజాబ్ తరహాలో కేంద్రం.. తెలంగాణ వరి ధాన్యం 100 శాతం కొనుగోలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రం తీరుపై టీఆర్ఎస్ఎల్పీలో చర్చించామని చెబుతూ టీఆర్ఎస్ చేపట్టే రైతు ధర్నాకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆహార ధాన్యాల సేకరణలో దేశం మొత్తం ఒకే పాలసీ ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికో విధానం పెట్టడం సరికాదని తెలిపారు.
30 లక్షల ఎకరాల వరి ధాన్యం సేకరించాల్సి ఉందని చెబుతూ కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. రెండు, మూడేళ్లకు ఆహార నిల్వలు ఎప్పుడూ కేంద్రం సిద్ధంగా ఉంచాలని సూచించారు. వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్మెంట్ ఎందుకు ఉండదు? అని సూటిగా ప్రశ్నించారు. చాలా విషయాల్లో కేంద్రం ఒకే విధానం అంటోందని తెలిపారు. ధాన్యం విషయంలో మాత్రం కేంద్రానికి ఒక విధానం లేదని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు సమస్యలపై పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపిచ్చారు. గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం సాగాలని కోరారు. రైతులు వేసే పంటలన్నింటికీ కేంద్రం గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 24, 25 తేదీల్లో రైతు సమస్యలపై ఆందోళనలు నిర్వహించాలని సూచించారు.
తెలంగాణతో పెట్టుకోకండి మోదీజీ
‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ప్రజలతో పెట్టుకోకండి. మేం ఉద్యమవీరులం. మిమ్మల్ని వదిలిపెడతామని అనుకోకండి. మీరు భంగపడతారు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత అనేకసార్లు బయటపడిందని, కరోనాను నియంత్రించడంలోనూ ఘోరంగా విఫలమైందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.
‘‘కోట్ల మందిని వేల కిలోమీటర్లు నడిపించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుంది. కనీసం రైళ్లను కూడా ఏర్పాటు చేయలేదు. అద్భుతమైన గంగా నదిలో వందల, వేల శవాలు తేలేటట్టు చేసిందీ ప్రభుత్వమే. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడిచినా.. ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఒక్క కొత్త ప్రాజెక్ట్ కట్టలేదు. కొత్త ఫ్యాక్టరీ పెట్టలేదు” అంటూ విమర్శించారు.
ఇటీవల విడుదలైన అన్ని ఇండెక్స్‌ల్లో భారతదేశ పరిస్థితి ఘోరంగా ఉందని చెబుతూ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో 149 దేశాలకు ర్యాంకులు ప్రకటిస్తే.. అందులో మన దేశానిది 139వ ర్యాంకు అని గుర్తు చేశారు. మన పక్కనున్న భూటాన్, నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే దిగువన ఉందని ఎద్దేవా చేశారు. పాలనలో మోదీ ఫెయిల్ అయ్యారని, ఆయనను ప్యాక్ చేసి పంపించాలని, దేశం బాగుపడాలంటే బీజేపీ ప్రభుత్వం పోవాలని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని స్పష్టం చేశారు.