సికింద్రాబాద్ లోని బోయగూడలో అగ్నిప్రమాదం సంభవించింది. టింబర్ డిపోలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది సజీవదహనమయ్యారు. కొందరు సజీవదహనం, పొగతో ఊపిరాడక మరికొందరు ప్రాణాలు వదిలారు.
అగ్నిప్రమాద సమయంలో టింబర్ డిపోలో 15 మంది కార్మికులు ఉన్నారు. ఇద్దరు కార్మికులు మంటల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మృతులంతా బిహార్ కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో టింబర్ డిపో, స్ర్కాప్ గోదాం ఉన్నాయి. టింబర్ డిపో నుంచి స్ర్కాప్ గోదాముకు మంటలు వ్యాపించాయి.
దట్టంగా వ్యాపించిన పొగ వల్ల మృతదేహాల వెలికితీతలో ఇబ్బందులు అవుతున్నాయని, అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు టింబర్ డిపోలో ప్రమాదం జరిగినట్టు గుర్తించారు.
మృతులు సికిందర్(40), బిట్టు(23), సత్యేందర్(35), గోలు(28), దమోదర్(27), రాజేశ్(25), పంకజ్(26), దినేశ్(35), రాజేశ్(25), చింటు(27), దీపక్(25)గా గుర్తించారు. 11 మంది మృతదేహాలను వెలికితీశామని అగ్నిమాపక అధికారి వెల్లడించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ దుర్ఘటన పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి రూ 2 లక్షలు చొప్పున ప్రధాని, రూ 5 లక్షల చొప్పున కేసీఆర్ ఆర్ధిక సహాయం ప్రకటించారు. మృతదేహాలను బీహార్ లోని వారి స్వస్థలాలకు పంపే ఏర్పాటు చేయమని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కేసీఆర్ ఆదేశించారు.