సబ్ కా సాత్.. సబ్ కా వికాష్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ కా సాత్…దేశ్ కా వినాష్‌గా మారిపోయిందని తెలంగాణ ఆప్ సర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరా శోభన్ ఆరోపించారు. పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ హైదరాబాద్‌లో ఆమె ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ట్యాంక్‌బండ్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఖాళీ సిలెండర్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరా శోభన్ మాట్లాడుతూ ప్రధానిగా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యావసర సరుకులు మొదలుకొని పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు అత్యంత వేగంతో పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు.
ముఖ్యంగా గ్యాస్ సిలెండర్ ధర వెయ్యి రూపాయలు దాటడంతో మహిళలు వంట వండలేక తిరిగి కట్టెల పొయ్యిని ఆశ్రయించే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు ఆదాయం సమకూర్చే పనిలో ప్రధాని మోదీ పడ్డారని, వారు ఎలా చెబితే అలా వింటూ ధరల పెరుగుదలకు అనుమతి ఇవ్వడం సిగ్గు చేటన్నాఆమె విమర్శించారు.
పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచుకుంటూపోవడం వల్ల ఆ ప్రభావం నిత్యావసర సరుకుల ధరలపై కూడా పడుతుందని ఆమె తెలిపారు. పెరిగిన ధరలతో పేద, సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే ఉంటే పేదలందరు ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం కూడా లేకపోలేదని ఆమె చెప్పారు.
కనుక ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయడం మానుకొని నిత్యావసర ధరలు మొదలుకొని పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించేందుకు కృషి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజలు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రశ్నించకపోతే రాబోయే రోజుల్లో ప్రజలపై మరిన్ని భారాలు మోపి బతుకులు దుర్భరం చేసే అవకాశం లేకపోలేదని ఆమె హెచ్చరించారు.