బర్లు, గొర్లు కాచుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులు, గొఱె కాపరుల భూముల జోలికొస్తే ఊరుకోమని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవసరం అయితే నిరాహార దీక్ష కూడా చేస్తానని స్పష్టం చేశారు.
ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల 35వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలం పారుపల్లి గ్రామంలో పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబోళ్ల భూముల అన్యాక్రాంతంపై స్పందిస్తూ గ్రామంలోని సర్వే నెంబర్ 279లో సుమారుగా 127 ఎకరాల భూమి ఉందని, ఎన్నో ఏండ్లుగా ఆ భూముల్లో గిరిజనులు, గొర్రెకురుమలు బర్లు, గొర్లు కాచుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
ఆ భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా మైనింగ్ కు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గతంలో వైయస్ఆర్ ఆ భూములు కబ్జాకు గురికాకుండా, అటవీశాఖ స్వాధీనం చేసుకోకుండా కాపాడి, పేదల కోసం కేటాయించారని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆ భూముల్ని ప్రైవేటు మైనింగ్ కు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలకు మూడెకరాలు ఇస్తానని చెప్పి, ఉన్న భూములను కేసీఆర్‌లా కేసీఆర్ లాక్కుంటున్నారని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ ను రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ప్రజల మేలు కోసం ఒక్క పని కూడా చేయలేదని ఆమె ధ్వజమెత్తారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పోడు పట్టాలు, రుణమాఫీ మాటలకే పరిమితం అయిందని ఆమె విమర్శించారు.
రైతుబంధు ఎకరాకు రూ.5వేలు ఇస్తే ఎలా సరిపోతాయని షర్మిల ప్రశ్నించారు. ఎకరాకు రూ.5 వేలు ఇస్తూ రూ.25వేల విలువైన పథకాలను కేసీఆర్ బంద్ పెట్టిండని ఆమె దయ్యబట్టారు. ఎరువుల మీద సబ్సిడీ, పంట నష్టపోతే పరిహారం, ఇన్ పుట్ సబ్సిడీ, రాయితీపై విత్తనాలు, యంత్ర లక్ష్మి వంటి పథకాలను కేసీఆర్ అటకెక్కించాడని ఆమె పేర్కొన్నారు.
ఇంట్లో ఇద్దరు అర్హులుంటే ఒక్కరికే పెన్షన్ ఇచ్చి, మరొకరికి అన్యాయం చేస్తున్నాడని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ ఏం చేసినా ఓట్ల కోసమేనని, ఎన్నికలు వస్తేనే కేసీఆర్ బయటకు వస్తాడని ఆమె విమర్శించారు. కేసీఆర్‌కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.
కాగా, ప్రతిపక్షాలు, ప్రభుత్వం ఒకటై ప్రజలను మోసం చేస్తున్నాయని ఆమె విమర్శించారు. ‘పేదల కోసం 46 లక్షల ఇండ్లు కట్టించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే సొంతం. పేదల కోసం ఆయన ఎన్నో పనులు చేశారు. కానీ, ఇప్పుడు కేసీఆర్ మాత్రం పేదలను పట్టించుకోవడంలేదు. కేసీఆర్ రూ. 200 పెన్షన్ ఇస్తున్నాడు, కానీ అవి దేనికీ సరిపోవడం లేదు” అని ఆమె ధ్వజమెత్తారు.