న్యాయవ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలని మాజీ రెవిన్యూ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హితవు చెప్పారు. ఇతర వ్యవస్థల్లో అందునా శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోవడం ఎంతవరకు అంటూ ఇటీవల మూడు రాజధానుల చట్టాన్ని రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడాన్ని ప్రశ్నించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గురువారం మధ్యాహ్నాం జరిగిన పరిపాలన వికేంద్రీకరణ.. మూడు రాజధానులపై స్వల్పకాలిక చర్చలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. లో పాల్గొంటూ ఏపీ అసెంబ్లీకి కొన్ని పరిమితులు పెడుతూ హైకోర్టు వ్యాఖ్యలు చేసిందని గుర్తు చేశారు. మూడు రాజధానులపై అసెంబ్లీ చట్టం చేయొద్దంటూ హైకోర్టు తెలిపిందని విస్మయం వ్యక్తం చేశారు.
“తీర్పు తర్వాత న్యాయ నిపుణులతో చర్చించాను. ఆపైనే సభానాయకుడికి ఓ లేఖ రాశాను. దీనిపై సభలో చర్చించాల్సిన అవకశ్యత ఉందని భావిస్తున్నా. చర్చించే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్పీకర్ సీతారాంలకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థల ప్రాధాన్యతను తగ్గించాలన్న అభిప్రాయం తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేస్తూ, బాధ్యతల్ని కట్టడి చేసే విధంగా ఉన్నాయన్న అభిప్రాయం మాత్రమే తాను వ్యక్తం చేస్తున్నానని ఆయన తెలిపారు. ఇలాంటి సమయంలో కోర్టు వ్యాఖ్యలపై చర్చాసమీక్షలకు శాసన సభకు హక్కు ఉంటుందా? అనే విషయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ తీర్పును ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు.
రాజరిక వ్యవస్థలో రాజే శాసనం. ఒకరి చేతుల్లో ఉండడం వల్ల ప్రజా వ్యతిరేకత పుట్టుకొచ్చింది. ఆ తర్వాతే ప్రజాస్వామ్యం పుట్టుకొచ్చింది. రాజ్యాంగం రావడం వెనుక ఎంతో మంది కృషి ఉంది. వ్యవస్థల పరిధి, విధులు ఎంటన్న దానిపై స్పష్టత ఉండాలి. లేకుంటే వ్యవస్థల్లో అవ్యవస్ధత నెలకొనే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
సమాజం పట్ల తమకు పూర్తి బాధ్యత ఉందని గతంలో సుప్రీం కోర్టు ప్రకటించిందని గుర్తు చేస్తూ అంతేకానీ జ్యుడీషియిల్ యాక్టివిజం పేరుతో కోర్టులు విధులు నిర్వహించకూడదని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఒకవేళ శాసన వ్యవస్థ సరిగా పనిచేయకుంటే, ఆ విషయాన్ని ఎన్నుకున్న ప్రజలే చూసుకుంటారని ధర్మాన తెలిపారు. అంతేకానీ, కోర్టులు జోక్యం చేసుకోకూడదని అత్యున్నత న్యాయస్థానమే చెప్పిందని చెప్పారు.
అంతేకాదు.. ఎంత నిగ్రహంగా కోర్టులు వ్యవహరించాలో కూడా సుప్రీం కోర్టు వివరించిందని పేర్కొన్నారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వర్గం.. వేటికవే వ్యవహరించాలి. ఈ వ్యవస్థలన్నీ ప్రజల కోసమే ఉన్నాయి. న్యాయవ్యవస్థ, కోర్టులంటే గౌరవం ఉంది. విధి నిర్వహణలో ఒకదానిని మరొకటి పల్చన చేస్తే.. పరువు తీసుకోవడం తప్పించి ఏం ఉండదని ధర్మాన స్పష్టం చేశారు.
అందుకే ఒకరి విధి నిర్వహణలో మరొకరు జోక్యం చేసుకోవద్దని, రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చుకుండా అడ్డుపడొద్దని ధర్మాన సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గతంలో సుప్రీం కోర్టు, ఇతర న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు కాపీలను చదివి వినిపించారు కూడా. న్యాయ వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టులదేనని సుప్రీం కోర్టు చెప్పిందని ఆయన గుర్తు చేశారు.
రాజ్యాంగ బద్దమైన విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు మాత్రమే న్యాయ వ్యవస్థకు ఉందని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసిందని ధర్మాన తెలిపారు. అంతేకానీ, శాసనం చేసే సమయంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసిందని, ఆ హక్కు కేవలం రాజ్యాంగం కేవలం చట్ట సభలకు మాత్రమే కల్పించిందని ధర్మాన తేల్చి చెప్పారు.
‘కోర్టులు న్యాయం మాత్రమే చెప్పాలి. శాసనకర్త పాత్రలను కోర్టులు పోషించకూడదని సుప్రీం చెప్పింది. లేని అధికారాలను పోషించకూడదని, ప్రభుత్వాన్ని నడపొద్దు, నడపలేవు’ అని అత్యున్నత న్యాయస్థానమే పేర్కొంది అని ధర్మాన గుర్తు చేశారు.
ఒక పార్టీ సభలో మెజార్టీతో అధికారంలో ఉందంటే.. అంతకు ముందు ఉన్న ప్రభుత్వ విధానాలను మార్చమని ప్రజలు అధికారం ఇవ్వడమే అవుతుంది కదా అని ధర్మాన గుర్తు చేశారు. ఆ అధికారమే లేదని న్యాయస్థానాలు చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
వివిధ ప్రభుత్వాలు తీసుకున్న ఎన్నో నిర్ణయాలను ప్రభుత్వాలు మార్చిన సంగతి గుర్తు చేశారాయన. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దును తర్వాతి ప్రభుత్వాలు చేయలేదా? అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పాలసీతో నాటి సీఎం వైఎస్ఆర్ ఎంతమంది ప్రాణాలు కాపాడలేదు? విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో ఎన్ని అభ్యంతరాలున్నా..ఇది మా విధానం అని కేంద్రం చెప్పలేదా? అని వివరించారు.
శాసన సభ అధికారాల విషయంలో కోర్టు అభ్యంతరాలు ఉంటే ఎన్నికలు ఎందుకు?. శాసన వ్యవస్థ అధికారాలను అడ్డుకుంటే ప్రజలకే నష్టం అని అని ధర్మాన స్పష్టం చేశారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా.. వ్యవస్థల్ని రక్షించే పనిని అందరూ కొనసాగించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.